Franz Beckenbauer: ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం
X
ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం నెలకొంది. రెండు సార్లు ఫిఫా వరల్డ్ కప్ అందించిన జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం.. ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ (78) కన్నుమూశాడు. ఆయన స్వస్థలంలో సోమవారం రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచాడు. ఆయన మరణ వార్త విని ఫుట్ బాల్ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. తొలిసారి జర్మనీ వెస్ట్ కెప్టెన్ గా 1974లో వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్నాడు ఫ్రాంజ్. 1972లో ప్రతిష్టాత్మకమైన యూరో చాంపియన్షిప్ ట్రోఫీ విజేతగా నిలిచాడు. అంతేకాకుండా జర్మనీ లీగ్ లో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఘనత ఆయన సొంతం.
1990లో కోచ్ అవతారం ఎత్తిన ఫ్రాంజ్.. అప్పుడూ ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాడు. జర్మనీ తరుపున 104 మ్యాచ్ లు ఆడిన ఫ్రాంజ్.. బేర్న్ మ్యునిచ్ తరుపున 400లకు పైగా మ్యాచ్ లు ఆడాడు. తన కెరీర్ మొత్తంలో 582 మ్యాచ్ లు ఆడాడు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొంత కాలానికి కోచ్ అవతారమెత్తిన ఫ్రాంజ్.. అక్కడా తనదైన ముద్ర వేశాడు. కోచ్ గా పెద్దగా అనుభవం లేకపోయినా.. వరుసగా రెండు పర్యాయాలు జర్మనీని (1986, 1990) ఫైనల్స్ కు చేర్చాడు. దాంతో ఆటగాడిగా, కోచ్ గా వరల్డ్ కప్ ను ముద్దాడిన రెండో వ్యక్తిగా ఫ్రాంజ్ ఫుట్ బాల్ చరిత్రలో నిలిచిపోయాడు. ఫ్రాంజ్ కంటే ముందు.. బ్రెజిల్ లెజెండ్ మరియో జగల్లో.. ఆటగాడిగా, మేనేజర్ గా వరల్డ్ కప్ ను ముద్దాడాడు. కాగా కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ ఇద్దరు మరణించడం ఫుట్ బాల్ ప్రపంచానికి తీరని లోటు.