తూర్పు అమెరికాను వణికిస్తున్న భీకర వర్షాలు
X
అమెరికాలోని తూర్పు ప్రాంతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భీకర గాలులు, వడగళ్ల వానతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాను కారణంగా ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. వర్షాలు, గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 11లక్షలకుపైగా ఇళ్లు, ఆఫీసులు అంధకారంలో చిక్కుకున్నాయి. న్యూయార్క్ నుంచి టెన్నిసీ వరకు దాదాపు 10 రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వానంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
వాన వల్ల ఇప్పటికే చాలా విమానాలను రద్దు చేశారు. మరోవైపు టోర్నడోల ముప్పు కూడా పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. వాటి ప్రభావం 2.95 కోట్ల మందిపై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలను ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. అలబామా, జార్జియా, నార్త్, సౌత్ కారొలినా, మేరీల్యాండ్, డెలావర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెన్నిసీ, వెస్ట్ వర్జీనియాల్లో 11 లక్షల ఇళ్ళకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మరమ్మత్తులు చేసి విద్యుత్ లైన్లను పునరుద్ధరించడానిక కొన్ని రోజుల సమయం పట్టొచ్చని నాక్స్ విల్లె యుటిలిటీ బోర్డ్ చెబుతోంది.
భారీ వర్షాలతో పాటూ గంటకు 70మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో విమాన, రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వందలాది ఇళ్ళ పైకప్పులు ఎగిరిపోయాయి. ఇటీవలి కాలంలో ఇంతటి తీవ్ర తుఫాను ఎప్పుడూ రాలేదని అధికారులు చెబుతున్నారు.