Helicopter Crashe: కూలిన హెలికాఫ్టర్.. బ్యాంక్ సీఈవో మృతి
X
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా - నెవడా సరిహద్దుల్లో హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ బ్యాంక్ సీఈవో సహా ఆరుగురు మరణించారు. నైజీరియా అతి పెద్ద బ్యాంక్ అయిన యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ విగ్వే తన భార్య, కొడుకు సహా మరొకరితో కలిసి EC130 హెలికాఫ్టర్లో బయలుదేరారు. అయితే రాత్రి 10గంటల సమయంలో కాలిఫోర్నియాలోని హలోరన్ స్ప్రింగ్స్ సమీపంలో హెలికాఫ్టర్ కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా విగ్వే ఫ్యామిలీ అక్కడికక్కడే మరణించింది.
వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం, చలిగాలుల వల్ల హెలికాప్టర్ కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హెలికాఫ్టర్ ఆర్బిక్ ఎయిర్ LLCకి చెందినదిగా అధికారులు గుర్తించారు. హెలికాప్టర్ చివరిసారిగా కాలిఫోర్నియాలోని బార్‌స్టో సమీపంలో రాత్రి 9:49 గంటలకు కనిపించిందని ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ తెలిపింది. కాగా విగ్వే మృతి పట్ల ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకోంజో ఇవెలా సహా పలువురు సంతాపం ప్రకటించారు.