రెస్టారెంట్లో పేలిన సిలిండర్.. 31 మంది మృతి
X
చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలి 31 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి గాయాలవ్వగా.. అందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. యించువాన్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం జరిగింది. రెస్టారెంట్ జనాలతో కిక్కిరిసిపోయిన టైంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడడంతో 31 మంది అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. అయితే మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బుధవారం రాత్రి 8 గంటలకు ప్రమాదం జరగ్గా.. గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా చల్లారాయి.
యించువాన్లో డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కోసం మూడురోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో బంధువులు, ఫ్రెండ్స్ తో ఈ నగరం సందడిగా మారింది.
మృతుల్లో ఎక్కువ మంది వారే ఉన్నారు. ఘటనాస్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై అధ్యక్షుడు జీ జింగ్‌పిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.