పబ్జీ ప్రేమకథ.. నా పిల్లలను నాకు అప్పగించండి.. పాకిస్థాన్ భర్త విజ్క్షప్తి
X
దేశాల సరిహద్దులు దాటిన పబ్జీ ప్రేమ కథలో కీలక ములుపులు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్థాన్కు చెందిన సీమా గులాం హైదర్కు, నోయిడాకు చెందిన సచిన్తో ఆన్లైన్ గేమ్ పబ్జీ లో పరిచయం అయ్యింది. కొన్నాళ్లకు వీరి పరిచయం ప్రేమగా మారింది. ప్రియుడిని విడిచి ఉండలేక.. పాకిస్థాన్ వదిలి తన నలుగురు పిల్లలతో అక్రమంగా ఇండియాలోకి చొరబడింది.
ఆ తర్వాత వారు అరెస్ట్ కావడం.. కోర్డు వారికి బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన పిల్లలను తిరిగి పాకిస్థాన్ పంపించాలని ఆమె భర్త విజ్ఞప్తి చేస్తున్నాడు. ‘‘ సీమా చేసిన పనికి షాకయ్యా. నా పిల్లలను తిరిగి ఇవ్వమని మోడీ ప్రభుత్వాన్ని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. నా పిల్లలను పోషించడానికి నేను చాలా కష్టపడుతున్నాను" అని గులాం వాపోయాడు.
సీమాకు పాకిస్థాన్లో గులాం హైదర్తో వివాహం జరిగింది. అతడు సౌదీ అరేబియాలోని టైల్స్ సంస్థలో పనిచేస్తున్పాడు. అయితే సీమా మాత్రం తిరిగి పాకిస్థాన్ వెళ్లేది లేదని చెబుతోంది. తనను తాను భారతీయురాలిగానే భావిస్తున్నానని.. ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెబుతుండడం గమనార్హం. ఇండియాకు వచ్చేందుకు సీమ పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. తన ప్రియుడి కోసం భర్తతో విభేదించి.. ఓ ఫ్లాట్ను అమ్మి 12 లక్షల పాకిస్థానీ రూపాయలను పోగు చేసుకుంది.తనతోపాటు ఏడేళ్లలోపు ఉన్న తన నలుగురు పిల్లలకు విమాన టిక్కెట్లు, నేపాల్ వీసా ఏర్పాటు చేసుకుంది. మేలో దుబాయ్ మీదుగా నేపాల్లోని పోఖారాకు చేరుకుంది. అక్కడి నుంచి ఖాట్మాండుకు చేరుకుని.. ఆపై ఢిల్లీకి బస్సులో బయలుదేరి మే 13న గ్రేటర్ నోయిడాకు చేరుకుంది. అక్కడ సచిన్ ఓ రూంను అద్దెకు తీసుకుని ఆమెను ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇంటి ఓనర్ ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇకపై తాను అధికారికంగా భారత్‌లోనే ఉండేందుకు అధికారులను సంప్రదిస్తానని సీమా తెలిపారు. ‘‘ మమ్మల్ని నెలల తరబడి జైల్లో పెడతారని భావించా. కానీ, బెయిల్ వార్త వినగానే ఆనందంతో అరిచా. నా భర్త సచిన్ భారతీయుడు.. నేనూ భారతీయురాలిగానే భావిస్తున్నా. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదు. అక్కడ నా ప్రాణాలకు ముప్పు ఉంది’’ అని సీమా స్పష్టం చేసింది.