Home > అంతర్జాతీయం > IBM: ఉద్యోగులకు ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం ఐబీఎమ్ వార్నింగ్

IBM: ఉద్యోగులకు ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం ఐబీఎమ్ వార్నింగ్

IBM: ఉద్యోగులకు ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం ఐబీఎమ్ వార్నింగ్
X

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ (ఐబీఎం).. తన కంపెనీలోని మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అల్టిమేటమ్ జారీ చేసింది. ఇకపై రిమోట్ వర్కింగ్ పద్ధతిలో ఉన్న మేనేజర్లు ఆఫీసులకు దగ్గరకు మారాలని లేదా కంపెనీకి రిజైన్ చేసి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పింది. వారానికి క‌నీసం మూడు రోజులు కార్యాల‌యంలో లేదా క్లైంట్ లొకేష‌న్‌లో త‌క్ష‌ణ‌మే రిపోర్ట్ చేయాల‌ని అమెరికా కేంద్రంగా కంపెనీలో ప‌నిచేసే మేనేజ‌ర్లంద‌రినీ ఐబీఎం హెచ్చ‌రించింది.

అమెరికాలో విధులు నిర్వ‌హిస్తున్న మేనేజర్లకు, హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి జనవరి 16న ఐబీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్ గ్రాంజెర్ ఓ ఇంటర్నల్‌ మెయిల్‌ పంపారు. అందులో ‘ప్ర‌స్తుతం మీరు ఎక్క‌డ ప‌నిచేస్తున్నారో సంబంధం లేకుండా ఆఫీస్ లేదా క్ల‌యింట్ లొకేష‌న్‌లో క‌నీసం వారానికి మూడు రోజులు విధులు నిర్వ‌హించాల‌ని’ మెయిల్‌లో పేర్కొన్నట్లు మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. బ్యాడ్జ్-ఇన్ డేటా ఆఫీసులకు వస్తున్న ఉద్యోగుల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపయోగించబడుతుందని ఇది మేనేజర్లు, హెచ్ ఆర్ డిపార్ట్మెంట్లతో పంచుకోబడుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి మిలిటరీ సర్వీస్, మెడికల్ నీడ్స్ ఉన్న ఉద్యోగులకు మాత్రమే కొంత మినహాయింపులను కంపెనీ అందిస్తోంది.

కంపెనీ మెమో ప్రకారం ఉద్యోగులు ఆఫీసులకు 80 కిలోమీటర్ల లోపు లేదా 50 మేళ్ల ప్రయాణ దూరంలో అందుబాటులో ఉండాలని తెలుస్తోంది. వీటిని పాటించటానికి సిద్ధంగాలేని లేదా రీలొకేట్ కావటానికి నిరాకరించే ఉద్యోగులు రిమోట్ వర్క్ పొందటం కుదరదని వారు నిర్మొహమాటంగా కంపెనీని వీడొచ్చని ఐబీఎమ్ వెల్లడించింది. కంపెనీ తన పనితీరును మెరుగుపరుచుకునేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు, వినూత్నమైన ఆలోచనలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆఫీసులకు రాని ఉద్యోగులకు ప్రమోషన్లు అరుదుగా ఉంటాయని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో ఐబీఎమ్ సీఈవో అరవింద్ కృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే.

Updated : 30 Jan 2024 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top