ఇమ్రాన్ ఖాన్ దంపతులకు షాక్.. పెళ్లి కేసులో ఏడేళ్ల జైలు
X
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు అక్కడి కోర్టు గట్టి షాకిచ్చింది. ఇమ్రాన్‌ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవ్యతిరేక వివాహం కేసులో వారికి కోర్టు శిక్ష విధించింది. 2018లో బుష్రాను ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చాక వెయిటింగ్ పీరియడ్ను పూర్తిచేయలేదని ఆరోపణలు వచ్చాయి. రెండు వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం లేదా ఇద్దత్ పాటించాలనే ఇస్లామిక్ ఆచారాన్ని ఆమె ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీబీ మొదటి భర్త ఖవార్ మనేకా కేసు పెట్టారు.
ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇప్పటికే ఆయనకు రెండు కేసుల్లో జైలు శిక్ష పడింది. దేశ రహస్యాలను లీక్ చేసినందుకు 10ఏళ్లు, ప్రభుత్వ కానుకలను అమ్ముకున్నందుకు 14ఏళ్ల జైల శిక్ష విధిస్తూ అక్కడి కోర్టులు తీర్పులు చెప్పాయి. తాజా శిక్షతో ఆయనకు కోర్టులు 31ఏళ్ల శిక్ష విధించినట్లు. అయితే ఈ శిక్షలు ఒకేసారి అమలు చేస్తారా లేక ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.