భారత రెజ్లర్లకు యునైటెడ్ వరల్డ్ రెజ్లర్ అనూహ్య మద్దతు
X
భారత రెజ్లర్ల నిరసనపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న మల్లయోధులకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అండగా నిలిచింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. కష్టపడి సాధించిన పథకాలను కూడా గంగా నదిలో వేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఆమరణ నిరాహార దీక్ష సైతం వారు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం రోజున మార్చ్ నిర్వహించిన రెజ్లర్ల విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ తీవ్రంగా ఖండించింది. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు చేపట్టిన దర్యాప్తు కమిటీ రిపోర్టుపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవడంతో పాటు 45 రోజుల్లోగా రెజ్లింగ్ ఫెడరేషన్కు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఒకవేళ అలా జరగని పక్షంలో ఫెడరేషన్‌ను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీరుతో ఇప్పటికే ఈ ఏడాది ఢిల్లీలో జరగాల్సిన ఆసియా చాంపియన్‌షిప్‌ను మరో చోటుకు తరలించాలని నిర్ణయించినట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీసులు మాత్రం బ్రిజ్ భూషణ్‌పై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. అందుకే ఆయనను అరెస్ట్ చేయలేదని చెబుతున్నారు. మరోవైపు తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఉరేసుకునేందుకు సిద్ధమని బ్రిజ్ భూషణ్ అంటున్నారు. ఈ క్రమంలో రెజ్లర్ల ఆందోళనకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
UWW issues statement on Wrestling Federation of Indiahttps://t.co/TyNfSX57qW
— United World Wrestling (@wrestling) May 30, 2023