3 చిరుతలకు అనారోగ్యం.. కునో నేషనల్ పార్కులో ఏం జరుగుతోంది?
X
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో మూడు చిరుతలు అనారోగ్యం పాలయ్యాయి. వాటికి గాయాలు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు చిరుతల మెడలో గాయాలకు పురుగులు పట్టినట్లు అధికారులు గుర్తించారు. చిరుతల మెడకున్న కాలర్ ఐడీల కారణంగానే గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఒబాన్ అనే చిరుత కాలర్ ఐడీని తీసి పరిశీలించగా లోతైన గాయం కనిపించింది. అందులో పురుగులను గుర్తించారు. ఎల్టన్, ఫ్రెడ్డీ చిరుతల మెడలో నుంచి కాలర్ ఐడీ తొలగించి చూడగా వాటి మెడకు సైతం గాయాలైనట్లు గుర్తించారు. దీంతో పార్కులో ఉన్న 10 చిరుతల ఆరోగ్యాన్ని డాక్టర్లు పరిశీలిస్తున్నారు.
చిరుతల ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి నిపుణుల బృందం మంగళవారం కునో నేషనల్ పార్కుకు చేరుకుంది. వారు చిరుతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అందులో అగ్ని అనే చిరుత కాలికి ఫ్రాక్చర్, వాయు అనే చిరుత ఛాతిలో గాయం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల వరుసగా 8 చిరుతలు చనిపోవడంతో నిర్భయ అనే చిరుతను తప్పించి దక్షిణాఫ్రికా నుంచి చిరుతలన్నింటినీ ఎన్ క్లోజర్ లోనే ఉంచారు. గతవారం చనిపోయిన మగ చిరుత సూరజ్ గొంతుకు గాయమై అందులో పురుగులు చేరడంతో ప్రాణాలు కోల్పోయిందని నివేదికలో తేలింది. దీంతో మరో మూడు చిరుతల మెడలో గాయాలు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.