Joe Biden Security : భారత్‌కు వస్తున్న అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ ఎలా ఉంటుందో తెలుసా..?
X
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జి20 శిఖరాగ్ర సమావేశం కోసం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాల నేతలు ఢిల్లీ వస్తున్నారు. ఈరోజు, రేపు జరిగబోయే ఈ సమావేశాల కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సహా పలు దేశాల నేతలు శుక్రవారం ఢిల్లీ చేరుకోనున్నారు. కాగా అందరి దృష్టి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పైనే ఉంది. అందుకు కారణం.. సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న బైడెన్ తోపాటూ ఆయన సెక్యూరిటీ సిబ్బంది(యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ) మొత్తం కూడా ఢిల్లీకి కదిలివస్తోంది.
3 నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్
అధ్యక్షుడి భద్రతలో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఏజెన్సీ 1865లో ఏర్పడినప్పటికీ, 1901 నుంచి దీనికి అమెరికా అధ్యక్షుడికి భద్రతా బాధ్యతలను అప్పగించారు. ఈ సీక్రెట్ సర్వీసులో దాదాపు 7 వేల మంది ఏజెంట్లు, అధికారులు పనిచేస్తారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. వీరి ట్రైనింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన శిక్షణల్లో ఒకటిగా భావిస్తారు. అధ్యక్షుడి భద్రత విషయంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈ సీక్రెట్ సర్వీస్‌కే ఉంటుంది. తనను ఒంటరిగా వదిలేయాలని, అధ్యక్షుడు స్వయంగా కోరినా, ఆ ఆదేశాలను వారు స్వీకరించరు. అమెరికా అధ్యక్షుడు వేరే ఏ దేశానికైనా వెళ్లాలని నిర్ణయించుకుంటే.. నిర్ధారిత తేదీకి దాదాపు 3 నెలల ముందు నుంచే సీక్రెట్ సర్వీస్ తమ పనులు ప్రారంభిస్తుంది.
పకడ్బందీ భద్రతకు కారణమిదే..
అధ్యక్షుడు భద్రతా వలయంలో ఉంటారు. అందులో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. అది అత్యంత బలమైనదే కాదు, అత్యంత ఖరీదైనది కూడా.నిజానికి అమెరికా తమ నలుగురు అధ్యక్షులు హత్యకు గురికావడాన్ని చూసింది.1865లో అబ్రహాం లింకన్, 1881లో జేమ్స్ గార్‌ఫీల్డ్, 1901లో విలియమ్ మెకిన్లే, 1963లో జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురయ్యారు.అందుకే, తమ అధ్యక్షుడికి భద్రత విషయాన్ని అమెరికా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది.
మూడు లేయర్లతో సెక్యూరిటీ
అమెరికా అధ్యక్షుడికి మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. అన్నిటికంటే లోపల అధ్యక్షుడి ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్, మధ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, ఆ తర్వాత పోలీసులు ఉంటారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ వస్తున్నారు కాబట్టి.. వీటికి అదనంగా ఢిల్లీ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తో కూడిన మరొక సెక్యూరిటీ లేయర్ కూడా ఉంటుంది. అమెరికా సీక్రెట్ సర్వీస్, వైట్ హౌస్ స్టాఫ్ రెండు మూడు నెలల ముందే ఆయా దేశాలకు వచ్చి స్థానిక సెక్యూరిటీ ఏజెన్సీలను కలుస్తారు. అక్కడి ఇంటెలిజెన్స్ బ్యూరో వీవీఐపీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడుతారు.అధ్యక్షుడు ఎక్కడ బస చేయాలి అనేది సీక్రెట్ సర్వీస్ నిర్ణయిస్తుంది. ఆ ప్రాంతాన్ని నిశితంగా తనిఖీలు చేస్తుంది. హోటల్ సిబ్బంది నేపథ్యాన్ని కూడా చెక్ చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎక్కడకు వెళ్లినా, అందులో వేలమంది(సెక్యూరిటీ) ఇన్వాల్వ్ అవుతారు. అందుకే, “అమెరికా అధ్యక్షుడు విదేశీ ప్రయాణం చేస్తే ప్రపంచం మొత్తం స్తంభిస్తుంది” అని అంటారు అక్కడి దేశస్తులు.