పైలెట్‌కు అస్వస్థత.. విమానం నడిపిన ప్రయాణికురాలు.. చివరికి ఇలా..
X
విమానం నడిపే పైలెట్ అనుకోకుండా అనారోగ్యానికి గురైతే కోపైలెట్ నడుపుతాడు. ఇద్దరూ అనారోగ్యం బారిన పడడం సాధారణంగా జరగదు కనుక విమాన ప్రయాణాలు 99.99 శాతం సురక్షితమే. అయితే కొన్ని సాంకేతిక లోపాల వల్ల, మానవ తప్పిదాల వల్ల విమానాలు పిట్టల్లా నేలకూలుతుంటాయి. చిన్న విమానాల సంగతి చెప్పక్కర్లేదు. కొన్ని చిన్నవిమానాల్లో ఒకే పైలెట్ ఉంటారు. ఆ ఒక్క పైలెట్ కూడా జర్నీ మధ్యలో అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏమిటి? గాల్లో దీపమే అనుకోక తప్పదు. ఓ చిన్న విమానంలో అలాంటి పరిస్థితే తలెత్తింది. పైలెట్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చేసేదేమీ లేక ఓ ప్రయాణకురాలు ధైర్యే సాహసే లక్ష్మి అని తనే విమానం నడిపింది. తెలియని విద్య కావడంతో కుప్పకూల్చేసింది. అయితే విమానంలో వారిద్దరే ఉండడంతో ముప్పు తప్పింది. పైలెట్ తీవ్రంగా గాయపడి చావు బతుకుల్లో ఉండగా, ఆమె మాత్రం కొద్దిపాటి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లిపోయింది.
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం విన్‌యార్డ్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం ఈ సంఘటన జరిగింది. న్యూయార్క్‌లోని వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుంచి ‘2006 పైపర్ మెరిడియన్’ రకం విమానం ఒక ప్రయాణికురాలిని తీసుకుని విన్‌యార్డ్‌కు బయలుదేరింది. పైలట్‌కేమో 79 ఏళ్లు. ప్రయాణం బాగానే సాగినా విన్‌యార్డ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్లేన్ అదుపు తప్పడంతో ప్రయాణికురాలు తను నడిపింది. చేతగాకపోవడంతో విమానం రన్ వే పక్కన కుప్పకూలింది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది హుటాహుటిన ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికురాలు చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిందని, పైలెట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బోస్టన్ ఆస్పత్రికి తరలించామని అధికారులు చెప్పారు.