ఇమ్రాన్ ఖాన్ కు లాహోర్ కోర్టు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
X
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయ్యాయి. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను విడిచిపెట్టారు. ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో అప్పట్లో పీటీఐ పార్టీ నేతలు పాకిస్తాన్ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
మే 9న జరిగిన అల్లరకు సంబంధించి పోలీసులు ఇమ్రాన్ సహా పీటీఐ నేతలపై రెండు కేసులు నమోదు చేశారు. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ ఆఫీసుతో పాటు ఓ కంటైనర్‌పై దాడి చేసి తగలబెట్టారన్న ఆరోపణలపై లాహోర్ పోలీసులు మే 10వ తేదీన ఇమ్రాన్ సహా పీటీఐ నాయకులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. తాజాగా ఈ రెండు కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు న్యాయమూర్తి అబెర్ గుల్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌తో పాటు మరో ఆరుగురు పీటీఐ పార్టీ నేతలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వారెంట్లు జారీ అయిన వారిలో ఇమ్రాన్ తో పాటు హసన్ నియాజీ, అహ్మద్ అజార్, మురాద్ సయూద్, జంషెడ్ ఇక్బాల్ చీమా, ముసరత్ చీమా, మియాన్ అస్లాం ఇక్బాల్ ఉన్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో, ఇమ్రాన్‌ను త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.