ఆ దేశ మంత్రితో మాట్లాడిన లిబియా మంత్రి.. వేటు వేసిన ప్రధాని
X
ఆమె ఓ దేశ విదేశాంగ శాఖ మంత్రి.. అనూహ్య రీతిలో తన పదవిని కోల్పోయారు. వేరే దేశం ప్రతినిధితో మాట్లాడడమే దీనికి కారణం. లిబియా విదేశాంగ మంత్రి నజ్లా అల్ మంగోష్.. గత వారం ఇటలీలోని రోమ్లో పర్యటించారు. అక్కడ ఇజ్రాయెల్ మంత్రి ఎలి కొహెన్‌ను అనధికారికంగా కలిశారు. ఈ సమావేశమే ఆమెపై వేటు పడడానికి కారణమైంది.
ఈ మీటింగ్ తర్వాత ఇజ్రాయెల్ ఓ ప్రకటన చేసింది. ఇరుపక్షాల సహకారం, మానవీయ అంశాల్లో ఇజ్రాయెల్ సాయం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి అంశాలపై లిబియా విదేశంగా మంత్రితో చర్చించామని ప్రకటించింది. దీంతోపాటు లిబియాలో యూదులకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడే అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపింది. ఈ సమావేశంపై లిబియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలు చోట్ల ఆందోళనలు చెలరేగాయి.
దేశంలో పరిస్థితిని అంచనా వేసి లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ నజ్లాను వెంటనే పదవి నుంచి తప్పించారు. అంతేకాకుండా ఆమెపై విచారణకు ఆదేశించారు. పలు అరబ్ దేశాల మాదిరిగానే లిబియా కూడా ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించడం లేదు. ఈ క్రమంలోనే ఆమె ఇజ్రాయెల్ ప్రతినిధితో మాట్లాడడం వివాదస్పదమైంది. అయితే ఆ దేశంతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని.. అది అనుకోని సాధారణ మీటింగ్ అని నజ్లా వివరణ ఇచ్చారు.