China : చైనాలో భారీ భూకంపం.. వందల మంది..
X
చైనాలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. చైనాలోని వాయువ్య గన్స్, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 111 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అర్థరాత్రి భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోగా.. అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. గన్స్ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సుమారు 100 మంది మరణించినట్లు చైనా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అదేవిధంగా కింగ్‌హై ప్రావిన్స్‌లోని హైడాంగ్ నగరంలో భూకంపం ధాటికి 11 మంది మృతి చెందారు. కాగా ఈ ప్రకృతి విపత్తుపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందించారు. భూకంప ప్రాంతాల్లో అన్ని విధాల సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలతో బయటపడ్డవారిని సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు. కాగా చైనాలో భూకంపాలు తరచుగా నమోదవుతుంటాయి. ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ప్రాణనష్టం తక్కువగానే ఉన్నప్పటికి పెద్ద సంఖ్యలో భవనాలు కూలాయి. ఇక సెప్టెంబర్ 2022లో సిచువాన్ ప్రావిన్స్‌లో 6.6 తీవ్రతతో సంభవించినప్పుడు సుమారు 100 మంది మృత్యువాతపడ్డారు.