ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి.. బహుమతిగా పోచంపల్లి పట్టుచీర
X
ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆ దేశ ప్రధాని ఎలిజబెత్ బార్న్ ఘనస్వాగతం పలికారు. జులై 15, 2023న జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో మోదీని.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. ఆ బహుమతి ప్రధానం తర్వాత ఫ్రాన్స్ దేశ పెద్దలకు భారత సంస్కృతికి చెందిన కానుకలను మోదీ అందించారు. గంధపు చెక్కతో చేసిన పురాతన హస్తకళ సితార్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడికి అందించగా.. ఆయన సతీమణి, ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ కు తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను శాండిల్వుడ్ బాక్స్ పెట్టి బహుమతిగా అందించారు మోదీ.
ఆ సితార్ పై.. సరస్వతి దేవి, గణేశుడి ప్రతిమ, భారత సంస్కృతి ప్రతిబింబించేలా జాతీయ పక్షి నెమలి చిత్రాలు ఉన్నాయి. దానిపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు ఉన్నాయి. కాగా, ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ అక్కడి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్లారు. ఇవాళ (జులై 15న) అబుదబీలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయోద్ అల్ నహ్‌యన్‌తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.