India- Maldives row: మార్చి 15కల్లా భారత సైన్యం వెళ్లిపోవాలి
X
మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు భారత్ కు డెడ్ లైన్ విధించారు. భారత సైన్యాన్ని మాల్దీవ్స్ నుంచి వెనక్కి పిలిపించాలనే అభ్యర్థనపై రెండు దేశాల అధికారులు సమావేశం అయ్యారు. ఆదివారం (జనవరి 14) మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. మార్చి 15కల్లా తమ దేశం విడిచి వెళ్లిపోవాలని మాల్దీవ్స్ ప్రెసిడెంట్ తేల్చిచెప్పారు. దాంతోపాటు భారత్ తో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా సమీక్షించుకున్నట్లు మాల్దీవ్స్ మంత్రి ఇబ్రహీం చెప్పుకొచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి చైనాలో పర్యటించిన ముయిజ్జు.. ఈ ప్రకటన చేశారు. మాల్దీవ్స్ లో భారత సైనికులు ఉండకూడదనేది ముయిజ్జు పాలసీ అని ఆ దేశ ప్రెసిడెంట్స్ ఆఫీస్ తెలిపింది. కాగా, ప్రస్తుతం మాల్దీవ్స్ లో 88 మంది భారత సైనికులు ఉన్నారు.
వీటితోపాటు గతంలో భారత్ మానవతా అవసరాల కోసం మాల్దీవ్స్ కు ఇచ్చిన రెండు హెలికాప్టర్ల వినియోగాన్ని ఆపాలని అధికారులను ముయిజ్జు ఆదేశించారు. భౌగోళికంగా చిన్నదేశమైనంత మాత్రాన.. తమను బెదిరించడం తగదని, దానికి ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదని అన్నారు. మరోవైపు మాల్దీవ్స్ అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే.