Home > అంతర్జాతీయం > ఘోరం.. ఆకలితో 500 మంది చిన్నారులు మృతి..!

ఘోరం.. ఆకలితో 500 మంది చిన్నారులు మృతి..!

ఘోరం.. ఆకలితో 500 మంది చిన్నారులు మృతి..!
X

ఆకలి కేకలతో సూడాన్ అల్లాడుతోంది. పారామిలటరీ, సైన్యం మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో ప్రజలు చితికిపోతున్నారు. ఏప్రిల్లో ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆకలికి తట్టుకోలేక ఈ నాలుగు నెలల్లో దాదాపు 500మంది చిన్నారులు మృతిచెందినట్లు సేవ్ ది చిల్డ్రన్ అనే ఎన్జీవో తెలిపింది. అంతేకాకుండా మరో 40వేల మంది చిన్నారులు పోషాకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పింది.

చిన్నారులు ఈ స్థాయిలో ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని ఎన్జీవో డైరెక్టర్ ఆరీఫ్ నూరీ చెప్పారు. ఆకలి కేకల్ని నిర్మూలించగలిగే ఆస్కారం ఉన్నా.. చిన్నారులు చనిపోవడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగితా చిన్నారులకు సరైన పోషకాహారం అందకుంటే వారి ప్రాణాలకు ప్రమాదమని వాపోయారు. ఇక ఈ అంతర్యుద్ధంతో ఐదు వేల మందిదాకా మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మరో 44లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు చెప్పారు.

ఈ ఘర్షణల వల్ల ప్రజలు ఆహారం, మంచి నీరు, మందులు లేక అల్లాడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. వైద్యం అందించాల్సిన ఆస్పత్రులే నాశనమవడం కలిచివేసే అంశం. ప్రస్తుతం సూడాన్‌లో 60 లక్షల మంది కరువు కోరల్లో చిక్కుకున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. కాగా సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన.. ఆర్మీ- పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది.

Updated : 22 Aug 2023 8:54 PM IST
Tags:    
Next Story
Share it
Top