Operation Ajay : 'ఆపరేషన్ అజయ్'.. ఢిల్లీకి చేరుకున్న తొలి విమానం
X
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ అజయ్'లో.. 212 మందితో తొలి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరింది. ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. గురువారం టెల్ అవీవ్‌కు చేరుకున్న చార్టర్డ్ విమానం.. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం బయలు దేరింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో నుంచి తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Operation Ajay: First flight carrying 212 Indian nationals from Israel, lands in Delhi pic.twitter.com/iwT9ugIREP
— ANI (@ANI) October 13, 2023
ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏ భారతీయుడిని వదిలిపెట్టదని అన్నారు. దేశ ప్రభుత్వం, దేశ ప్రధానమంత్రి వారిని రక్షించి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కట్టుబడి ఉందని అన్నారు. వీరందరిని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్.. అతని బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని.. . అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు.
ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 18000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. అందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు భారతీయులెవరూ గాయపడినట్లు సమాచారం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.