Pakistan's General Elections : భారీ హింస మధ్య ముగిసిన పాకిస్థాన్ జనరల్ ఎలక్షన్స్...నేడు ఫలితాలు
X
ఉగ్రదాడి భారీ హింస నడుమ పాకిస్థాన్ జనరల్ ఎలక్షన్స్ ముగిశాయి. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపూ ప్రారంభమైంది. జాతీయ అసెంబ్లీ, నాలుగు ప్రావిన్సుల శాసనసభల కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో..నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్- ఎన్, ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలో పీటీఐ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. చాలా వరకు ఇమ్రాన్ అభ్యర్థులు గెలుపు దిశగా వెళుతున్నారు. పలు అవినీతి కేసుల్లో కోర్టు శిక్ష
వేయడంతో ఇమ్రాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీచేయకుడదని ఆయనపై పాకిస్థాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. అంతేగాక పీటీఐ పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో నిషేధించింది.
దీంతో ఇమ్రాన్ పార్టీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పలు గుర్తులతో పోటీకి దిగారు. బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ ప్రక్రియ జరగడంతో మధ్యాహ్నాం కల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఉగ్రదాడి..
చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. అయితే పోలింగ్ కు ముందు బలూచిస్థాన్ లో ఉగ్రదాడి జరగడంతో ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెంట్ సేవలను నిలిపివేశారు. పోలింగ్ సమయంలో భారీ హింస నెలకొంది. చాలా చోట్ల సాయుధ మూకలు పోలింగ్ కేంద్రాలపై దాడులు చేశాయి. పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. మరో ఇద్దరు సామాన్యులు మృతి చెందారు. పోలింగ్ కేంద్రాలపై దాదాపు 51 ఉగ్రదాడులు జరిగాయని ఇర్మీ తెలిపింది. కాగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జైలు నుంచే తన ఓటుును వినియోగించుకున్నారు.