ల్యాండవుతున్న విమానంలో పిచ్చి పని.. చితక్కొట్టిన..
X
అది ఇండిగో విమానం. హైదరాబాద్ నుంచి అగర్తలా వెళ్తోంది. విమానం కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా.. ఓ వ్యక్తి డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది అడ్డుకోగా వారితో అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకపోవడంతో ప్రయాణికులు రంగంలోకి దిగి అతడిని చితక్కొట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
బిశ్వజిత్ దేబ్ నాథ్ అనే వ్యక్తి త్రిపురలోని తూర్పు అగర్తల ప్రాంతానికి చెందినవాడు. అతడు హైదరాబాద్ నుంచి గువాహటి మీదుగా అగర్తలా వెళుతున్న ఇండిగో విమానం ఎక్కాడు. అయితే అగర్తలలో విమానం మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా సడెన్గా వెళ్లి విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ దేబ్ నాథ్ను అతడిని అడ్డుకుంది. అయితే సిబ్బందితో అతడు అనుచితంగా ప్రవర్తించాడు.
విమాన సిబ్బంది ఎంత ఆపినా అతడు వినకుండా డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో ఇతర ప్రయాణికులు వచ్చి దేబ్ నాథ్కు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అతడిపై అగర్తల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేబ్ నాథ్ డ్రగ్స్కు బానిసై ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ఇండిగో సిబ్బంది కూడా గాయాలయ్యాయి.