పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు.. ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన న్యాయవాది
X
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. ద్రవ్యోల్బణం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదు కొరతతో అల్లాడుతున్న దాయాది దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచి జనానికి షాక్ ఇచ్చింది. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్ రూ.330కి చేరింది. పెట్రో ధరలు ఇంత రికార్డు స్థాయిలో పెరగడం పాక్ చరిత్రలో ఇదే తొలిసారి.
సెప్టెంబర్ 1న పాక్ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ అనుమతితో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.14 చొప్పున పెంచింది. తాజాగా మరోసారి పెట్రోల్‌పై లీటర్‌కు రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలు లీటర్‌కు రూ.330కు చేరాయి. ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు పాక్ సర్కారు పెట్రోల్‌పై రూ.32, డీజిల్ రూ.38 చొప్పున భారం మోపింది. పెరిగిన పెట్రో ధరలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు సైతం చుక్కలనంటుతుండటంతో అల్లాడిపోతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్లే దేశీయంగా పెట్రో రేట్లు పెంచాల్సి వస్తోందని పాక్ ఆర్థిక శాఖ చెబుతోంది. బెయిలౌట్ ప్యాకేజీలో భాగంగా ఐఎంఎఫ్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌పై 60, హైస్పీడ్ డీజిల్‌పై రూ.50 చొప్పున అభివృద్ధి సుంకం విధిస్తోంది. తాజాగా మరోసారి రేట్ల పెంచడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెంపును నిరసిస్తూ అన్ని రాష్ట్రాల గవర్నర్ నివాసాల ఎదుట ఆందోళన చేపట్టాలని జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ నిర్ణయించింది. పెట్రో రేట్ల పెంపుపై అజహర్ సిద్ధిఖీ అనే న్యాయవాది లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.