కెనడాలో ఖలిస్థానీలకు ఝలకిచ్చిన భారతీయులు.. మువ్వన్నెల జెండాలతో..
X
కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు కొనసాగుతున్నాయి. కేంద్రం హెచ్చరించినప్పటికీ ఇండియన్ ఎంబసీ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే టొరంటోలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎదుట ఖలిస్థాన్ మద్దతుదారులు నిరసనకు దిగారు. దీనికి ప్రతిగా మువ్వన్నెల జెండాలతో ప్రవాస భారతీయులు ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం వంటి నినాదాలతో హోరెత్తించారు.
ముందుగా ఖలిస్థాన్ మద్దతుదారులు జెండాలతో భారత రాయబార కార్యాలయం చేరుకుని నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనపై మండిపడ్డ భారత సంతతి ప్రజలు త్రివర్ణ పతాకాలతో అక్కడికి చేరుకుని ప్రదర్శన చేశారు. ఖలిస్థానీలు సిక్కులు కాదు, ఉగ్రవాదులు అన్న ప్లకార్డులను ప్రదర్శించారు.దీంతో కొద్దిసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.
#WATCH | Pro-Khalistan supporters protested in front of the Indian consulate in Canada's Toronto on July 8
— ANI (@ANI) July 9, 2023
Members of the Indian community with national flags countered the Khalistani protesters outside the Indian consulate in Toronto pic.twitter.com/IF5LUisVME
మరోవైపు లండన్‌లోని భారత హైకమిషన్ దగ్గర కూడా ఖలిస్థానీలు ఆందోళన నిర్వహించారు. కొద్దిమందే పాల్గొన్న ఈ నిరసన కొద్దిసేపు మాత్రమే జరిగింది. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధిపతి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఖలిస్తానీలు ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ నెల 8న భారత రాయబార కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టాలని ఖలిస్థాన్ మద్దతుదారులు ఆన్ లైన్లో ప్రచారం చేసినప్పటికీ.. చాలాచోట్ల ఎటువంటి స్పందన లేదు.