అరెస్టు భయం.. బ్రిక్స్ సదస్సుకు పుతిన్ డుమ్మా..
X
జొహానెస్‌బర్గ్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ డుమ్మాకొట్టనున్నారు. ఆయన మీటింగ్ కు రావడం లేదని దక్షిణాఫ్రికా ప్రకటించింది. పుతిన్ స్థానంలో ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సదస్సులో పాల్గొంటారని చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఏడాది మార్చిలో అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ క్రమంలో ఒకవేళ పుతిన్ జొహనెస్ బర్గ్ వస్తే అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 22-24 తేదీల్లో జొహానెస్‌బర్గ్ లో బ్రిక్స్ సదస్సు జరగనుంది. దీనికి హాజరవుతానని పుతిన్ ఇటీవలే ప్రకటించారు. అయితే ఒకవేళ పుతిన్ అక్కడకు వెళ్తే ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా ఆయనను అరెస్టు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. ఈ క్రమంలో పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధాన్ని ప్రకటించినట్లే అవుతుందని గతంలో రష్యా చెప్పిన మాటలను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోస గుర్తుచేశారు. ఓవైపు ఐసీసీ ఆదేశాలు, మరోవైపు రష్యా ప్రకటనతో దక్షిణాఫ్రికా సందిగ్ధంలో పడింది. ఈ అంశంపై ఇటీవలే పుతిన్‌తో చర్చించిన సిరిల్.. తమ సూచనతో రష్యా అధ్యక్షుడు పర్యటన రద్దు చేసుకున్నారని దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.
ఈ ఏడాది మార్చిలో పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌పై జారీ చేసింది. ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం, ఆ దేశానికి చెందిన పిల్లలను చట్టవిరుద్ధంగా దేశం నుంచి బహిష్కరించినందుకు అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్ధానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ కోర్టు పుతిన్ కు జారీ చేసిన అరెస్టు వారెంట్ పై రష్యా భగ్గుమంది. ఆ వారెంట్ తమకు టాయిలెట్ పేపర్ తో సమానమని ప్రకటించింది. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్ధానం పరిధిని తాము అసలు గుర్తించనేలేదని, అలాంటప్పుడు కోర్టు జారీ చేసే అరెస్టు వారెంట్ కు విలువ ఇవ్వమని చెప్పింది.