68వ అంతస్తు నుంచి పడిపోయిన సాహసికుడు.. ఎలా జరిగిందంటే..?
X
అతనికి సాహసాలంటే పిచ్చి. పెద్ద పెద్ద భవనాలు, నిర్మాణాలు సైతం ఈజీగా ఎక్కేస్తాడు. అతడి సాహసాలు చూస్తుంటే.. మనకే భయం వేస్తుంది. అలా ఉంటాయి అతడు చేసే పనులు. అయితే ఆ సాహసాలు చేస్తూనే ప్రాణాలు వదిలాడు. వివరంగా చెప్పాలంటే అతడి సాహసమే అతడి ప్రాణం తీసింది. ఈ ఘటన హాంకాంగ్లో జరిగింది.
రెమీ లుసిడి.. సాహస వీడియోలు చూసేవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రెమీ ఎనిగ్మా పేరుతో అతడు చేసే వీడియోలు అంత పాపులారిటీని తెచ్చిపెట్టాయి. అతడు హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌ను ఎక్కి.. వీడియో తీయాలనుకున్నాడు. ఈ క్రమంలో తన ప్రాణాలను కోల్పోయాడు. 68వ ఫ్లోర్ పైన ఉండగా.. పట్టు తప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
లుసిడి నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో బిల్డింగ్ సెక్యూరిటీ వద్దకు వచ్చి.. 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లాడు. కానీ 40వ అంతస్తులోని సదరు వ్యక్తి.. లుసిడి ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. అప్పటికే అతడు పైకెళ్లాడు. లుసిడి 49వ ఫ్లోర్ నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాత్రి 7.38 సమయంలో అతడిని పెంట్‌హౌస్‌లో పనిమనిషి చూసి పోలీసులకు కాల్ చేసింది.
అయితే అక్కడి నుంచి అతడు బ్యాలెన్స్ తప్పి.. కిందపడిపోయి స్పాట్లోనే మరణించాడు. పడిపోయేటప్పుడు అతడు కిటికీలను పట్టుకునేందుకు ప్రయత్నించాడని పనిమనిషి తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..లుసిడి కెమెరాను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. 6 రోజుల క్రితం లూసిడి హాంకాంగ్ స్కైలైన్ ఫోటోను చివరగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.