ఆర్ఎస్ఎస్‌పై కెనడా నిషేధం! అతడేం చెప్పాడు?
X
కెనడా, భారత్ మధ్య సంబంధాలు పాతాళానికి దిగజారిపోవడంతో బహిష్కరణలు, హెచ్చరికలు తీవ్రమవుతున్నాయి. కెనడాలో పరిస్థితి బాలేదని, భారతీయులు అప్రమత్తగా ఉండాలని భారత్ కోరగా, కెనడా పౌరులు ఉగ్రవాద ముప్పు ఎక్కువైన కశ్మీర్ గడ్డకు వెళ్లొద్దని ఆ దేశం హైఅలర్ట్ జారీ చేసింది. భారత్ కెనడియన్లు వీసాల జారీని కూడా నిలిపేసింది. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ప్రతీకారంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. కెనడాలోని హిందువులు వెంటనే తట్టాబుట్టా సర్దుకుని భారత్‌కు వెళ్లిపోవాలంటున్న ఖలిస్తాన్ నేతల హెచ్చరికల నడుమ సంఘ్ నిషేధం వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే కెనడా సంఘ్‌ను నిషేధించలేదని తెలిసింది.
ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలంటూ కెనడాలోని ఓ ఎన్జీఓ ప్రతినిధి మాట్లాడుతున్న వీడియోను నిషేధం విధిస్తూ ప్రభుత్వం ప్రతినిధి మాట్లాడుతున్న వీడియో అని ప్రచారం చేశారు. ఆర్ఎస్ఎస్‌పై నిషేధంతోపాటు కెనడాలోని భారత రాయబారిని వెళ్లగొట్టాలని, వాణిజ్య చర్చలను నిలిపేయాలని కూడా అతడు డిమాండ్ చేశాడు. దీంతో ‘కెనడాలో ఆర్ఎస్ఎస్‌పై నిషేధం’’ అని వార్తలు వచ్చాయి. ఆ వీడియో మాట్లాడింది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ముస్లిమ్స్(ఎన్సీసీఎం) సీఈవో స్టీఫెన్ బ్రౌన్ అని తెలిసింది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో రెండు దేశాల మధ్య గొడవలు మొదలయ్యాయి.