వాగ్నర్ చీఫ్ ఇంట్లో దాడులు. భారీగా బంగారం, విగ్గులు
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చుక్కలు చూపించిన కిరాయి సైనిముఠా నాయకుడు యెవగెనీ ప్రిగోజిన్ లీలలు ఒకటొకటే బయటపడుతున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు అతడు రష్యా విడిచి బెలారస్ పారిపోలేదని తేలింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అతని కార్యాలయంలో, ఇంట్లో రష్యా సైనికులు బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. సోదాల్లో భారీగా నగదు, బంగారం, పాస్ పోర్టులు బయటపడ్డాయి. చాలా రకాల విగ్గులు కూడా దొరికాయి. బట్టతల ఉన్న ప్రిగోజిన్ నానా పాస్ పోర్టుల సాయంతో విగ్గులు పెట్టుకుని పలు దేశాలు తిరిగినట్లు తెలుస్తోంది. అతని ఇంట్లో పలు విలాసవస్తువులు, స్విమ్మింగ్ పూల్, స్పా, బిలియర్డ్స్, ‘చర్చల్లో వాడేందుకు’ అని రాసి ఉన్న పెద్ద సుత్తి కనిపించాయి. 111 మిలియన్ డాలర్ల (రూ. 910 కోట్ల) నగదు కూడా దొరికినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రిగోజిన్ ప్రస్తుతం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోనే ఉన్నట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో కూడా గురువారం తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధలో రష్యా తరపున కిరాయి సైనికులతో భీకరంగా పోరాడిన ప్రిజోగిన్.. తమకు పుతిన్ నుంచి ఏ సాయమూ అందడం లేదని తిరుగుబాటు చేయడం తెలిసిందే. అయితే రూ. 8 వేల కోట్ల విలువైన మిలటరీ కాంట్రాక్టులను కట్టడబెడతామని పుతిన్ అతనికి హామీ ఇచ్చాడని, దీంతో ప్రవాసం కోసం బెలారస్ వెళ్లాడని వార్తలు వచ్చాయి. తనకు ఎదురుతిరిగినవారిని వ్యూహత్మకంగా మట్టికరిపించే పుతిన్ ప్రిగోజిన్‌ను కూడా అలాగే దెబ్బతీసినట్లు తెలుస్తోంది.