పిల్లలకు స్కూలుకు వెళ్లకపోతే తల్లిదండ్రులు ఇక జైలుకే..
X
చదువుకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. నిర్బంధ విద్య, ఉచిత భోజనం, నగదు ప్రోత్సాహకాలు మరెన్నో తాయిలాలు చూపుతున్నా కొందరు పిల్లలు బడికి వెళ్లడం లేదు. పేదరికం, రవాణా సదుపాయాలు లేకపోవడం, స్కూళ్లలో చదువులు సరిగ్గా చెప్పకపోవడం వంటి కారణాలెన్నో ఉన్నాయి. ఏది ఏమైనా పిల్లలందరూ చదువుకోవాల్సిందేనని ప్రభుత్వాలు చెబుతుంటాయి. చదువుకోకపోతే శిక్షల కింద రాయితీల రద్దు వంటి నిర్ణయాలూ తీసుకుంటూ ఉంటాయి. తాజాగా ఓ దేశం మరింత కఠిన చర్యలకు పూనుకుంది. అమానుష శిక్షలకు పేరు మోసి సౌదీ అరేబియా ప్రభుత్వం పిల్లలు చచ్చినట్టు చదువుకోవాల్సిందేనంటూ ‘జైలుశిక్ష’ నిర్ణయం తీసుకుంది. పిల్లలు వరుసగా 20 రోజులు బడికి డుమ్మా కొడితే వారి తల్లిదండ్రులను జైల్లో పడేస్తామని హెచ్చరింది.
ఈ నిర్ణయం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ‘‘సరైన కారణం లేకుండా విద్యార్థులు 20 రోజులకు మించి సెలవు పుడితే తల్లిదండ్రులను జైలు శిక్ష పడుతుంది. బాలల సంరక్షణ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థులు పాఠశాలకు రాలేకపోతే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు స్కూలు ప్రిన్సిపాల్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కారణం సరైందో కాదో తెలుసుకోవడానికి విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తారు. విద్యార్థి నుంచి వాంగ్మూలం తీసుకుంటారు. సరైన కారణాలు లేవని తేలితే కేసు పెట్టి కోర్టులో విచారణ జరపుతారు. నిబంధనల ప్రకారం జైలు శిక్ష పడుతుంది’’ అని సౌదీ విద్యాశాఖ అధికారులు వివరించారు. ‘‘ఒక విద్యార్థి మూడు రోజలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు మొదటి హెచ్చరిక కింద విషయం చెబుతారు. 5 రోజులు రాకపోతే హెచ్చరిక జారీ చేస్తాంరు. 10 రోజులు రాకపోతే మూడో హెచ్చరిక జారీ చేస్తారం. 15 రోజుల తర్వాత కూడా రాకపోతే మరో స్కూలుకు బదిలీ చేస్తారు. 20 రోజులు రాకపోతే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి’’ అని తెలిపారు.