పురిట్లోనే చనిపోయిన బిడ్డ.. 42 ఏళ్ల తర్వాత తల్లిని కలిశాడు
X
పుట్టిన కొన్ని గంటలకే చనిపోయాడనుకున్న కొడుకు.. తిరిగి 42 ఏళ్ల తర్వాత తన కళ్లముందే ప్రత్యక్షమైతే.. ఆ కన్నతల్లి పడే సంతోషం మాటల్లో వర్ణించలేనిది. పురిటి బిడ్డను చేతుల్లోనుంచి తీసుకున్న ఆసుపత్రి నర్సులు.. నీ కొడుకు ఇక లేడని చెప్పగా.. కడుపు కోతతో కన్నీరు మున్నీరైంది ఆ తల్లి. అయితే అదే కుమారుడు 42 ఏళ్ల తర్వాత సజీవంగా కళ్ల ముందు నిలబడి అమ్మా అని పిలిస్తే.. ఆ అపూర్వ దృశ్యం ఇటీవల చిలీలోని వాల్దీవియాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిలీ రాజధాని శాంటియాగోలోని ఓ ఆసుపత్రికి మారియా ఏంజెలికా గొంజాలెజ్ 42 ఏళ్ల కిందట ప్రసవం కోసం వెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు కాన్పు చేసి.. నెలలు నిండకుండా బిడ్డ పుట్టారని చెప్పి ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తిరిగి గొంజాలెన్ తన బిడ్డ కోసం ఆసుపత్రికి రాగా నీ బిడ్డ చనిపోయాడని, బిడ్డను పూడ్చిపెట్టివేశామని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె ఆస్పత్రి నుంచి నిరాశగా వెనుదిరిగారు. ఆ తర్వాత అదే శిశువును ఆస్పత్రి సిబ్బంది విక్రయించగా.. అమెరికా జంట దత్తత తీసుకుంది. వారి దగ్గర జిమ్మీ లిప్పర్ట్ థైడెన్ పేరుతో పెరిగి పెద్దై అమెరికా సైన్యంలో చేరాడు. జొహన్నా అనే మహిళను వివాహం చేసుకోగా.. వీరికి ఎబ్బా జాయ్, బెట్టీ గ్రేస్ అనే పిల్లలు పుట్టారు.
ఇదిలా ఉండగా, 1970, 80లలో చిలీ నుంచి అక్రమంగా తరలించిన వేలాది మందిని వారి కుటుంబాలతో కలిపేందుకు నాస్ బుస్కామోస్ అనే స్వచ్ఛంద సంస్థ మై హెరిటేజ్ అనే ప్రాజెక్టును చేపట్టింది. ఆ సంస్థ అన్వేషణలో థైడెన్ శాంటియాగో ఆసుపత్రిలో జన్మించినట్లు తెలుసుకుంది. మరోవైపు, థైడెన్ కూడా తన తల్లిదండ్రుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో తనకు తల్లితోపాటు ఐదుగురు తోబుట్టవులు ఉన్నట్లు బుస్కామోస్ ద్వారా తెలుసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షలో తాను చిలీకి చెందిన వ్యక్తినేని నిర్దారణ కావడంతోపాటు కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోలింది. తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలన్నీ పంపితేగానీ తల్లి నమ్మలేదు. చివరకు థైడెన్ తన భార్యాపిల్లలతో కలిసి చిలీ చేరుకుని, వల్దీవియాలోని తల్లిని కలుసుకున్నాడు. తల్లీ, బిడ్డ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.