మాల్దీవ్స్ అధ్యక్షుడికి ఊరట.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
X
అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు మాల్దీవ్స్ సుప్రీం కోర్టులో ఉపశమనం లభించింది. గురువారం పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్‌లలో తాజా సవరణను సుప్రీం కోర్టు వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ సవరణ ప్రతిపక్ష ఎంపీలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిపై అభిశంసనను సులభతరం చేసింది. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతి లేదా ఉప రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానానికి పార్లమెంటు సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఓటు అవసరమని రాజ్యంగం నిర్దేశించింది.
అయితే, అవసరమైన ఓట్ల సంఖ్యను తగ్గించడం ద్వారా అభిశంసన తీర్మానాన్ని సులభతరం చేసేందుకు.. ఇటీవల పార్లమెంటు తన స్టాండింగ్ ఆర్డర్స్ ను సవరించింది. దీంతో అభిశంసనకు అవసరమైన 58 మంది సభ్యుల బలం 54కు తగ్గిపోయింది. మొత్తం సభ్యుల సంఖ్య 87 నుంచి 80కి పడిపోయింది. ప్రతిపక్ష ఎండీపీ(43), డెమోక్రట్లు(13) పార్లమెంటులో కలిసి ముందుకు వెళ్లేందుకు జనవరిలో జట్టు కట్టాయి. దీంతో వీరి బలం 56కు చేరింది. మాల్దీవుల అటార్నీ జనరల్ కార్యాలయం జనవరి 28న సవరణపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఇందులో న్యాయస్థానం తుది నిర్ణయం ఇచ్చే వరకు సవరణను వాయిదా వేయాలని డిమాండ్ చేసింది.
కాగా ఇటీవల మాల్దీవ్స్ లోని భారత బలగాలను వెనక్కి వెళ్లిపోయవాలని అక్కడి అధ్యక్షుడు మొయిజ్జు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత సైనికుల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందితో భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ తెలిపారు. భారత్ కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటుంది.