Home > అంతర్జాతీయం > తెలుగు విద్యార్థులకు షాక్.. వెనక్కి పంపిన అమెరికా

తెలుగు విద్యార్థులకు షాక్.. వెనక్కి పంపిన అమెరికా

తెలుగు విద్యార్థులకు షాక్.. వెనక్కి పంపిన అమెరికా
X

అమెరికా.. ఎంతోమంది కలలకు నిలయం. అక్కడికి వెళ్లాలని లేదా అక్కడ చదువుకోవాలని ఆరాటపడుతుంటారు. మనదేశం నుంచి ప్రతిఏటా వేల సంఖ్యలో విద్యార్థులు వెళ్తుంటారు. అయితే తాజాగా వెళ్లిన తెలుగు విద్యార్థులకు అధికారులు షాకిచ్చారు. ఎయిర్ పోర్టు నుంచే వెనక్కి పంపారు. అసలు ఎందుకు పంపారో తెలియక విద్యార్థులు సహా వారి తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పి పంపారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపించారు. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో ప్రాంతాల నుంచి మొత్తం 21 మందిని తిప్పిపంపినట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అధికారుల అనుమానాలు..

ఎయిర్ పోర్టులకు చేరుకున్న విద్యార్థులను అధికారులు తనిఖీ చేశారు. అడ్మిషన్లు పొందిన వర్సిటీలో ఫీజులు, విద్యార్థుల ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ఫోన్లు, మెయిళ్లు, కన్సల్టెన్సీలు, అమెరికాలోని విద్యార్థులతో వారు మాట్లాడిన మాటలను పరిశీలించిన అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో 21మంది విద్యార్థులను తిరిగి పంపించారు. ఇక ఈ వ్యవహారంపై అమెరికా తెలుగు అసోసియేషన్లు వాకబు చేస్తున్నాయి. సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మళ్లీ 5ఏళ్ల దాకా..

అన్ని వివరాలు, డాక్యుమెంట్లు పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. అయితే సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు. అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే విద్యార్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సడెన్ గా వారిని వెనక్కి పంపడంతో వారి తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్‌ అయిన విద్యార్థులు తిరిగి 5 ఏళ్ల దాకా ఆ దేశ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు.



Updated : 18 Aug 2023 8:16 AM IST
Tags:    
Next Story
Share it
Top