రోబో మూవీ సీన్ రిపీట్.. ఇంజనీర్‌పై దాడి చేసిన మరమనిషి
X
టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. దాంతో ఎన్ని లాభాలున్నాయో.. అంతే డేంజర్ కూడా. చిన్న పొరపాటు మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాల గురించి గతంలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో మూవీలో రోబో కాస్తా విలన్‌గా మారుతుంది. రీల్ లైఫ్‌లోని ఈ సీన్ రియల్ లైఫ్‌లోనూ జరిగింది. టెస్లా కంపెనీకి చెందిన ఓ రోబో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే సమయంలో ఓ ఇంజనీర్‌పై దాడి చేసింది. 2021లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆస్టిన్లోని టెస్లా గిగా టెక్సాస్ ఫ్యాక్టరీలో కార్ల తయారీలో ఉపయోగించే అల్యూమినియం పార్ట్‌ను తీసుకెళ్లేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. అయితే ఓ రోబోలో తలెత్తిన సాంకేతిక లోపం ఓ ఇంజనీర్ ప్రాణాల మీదకు తెచ్చింది. రోబోల మెయింటెనెన్స్‌లో భాగంగా ఓ ఇంజనీర్ సాఫ్ట్వేర్ అప్ డేట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మెయింటెనెన్స్ కోసం రెండు రోబోలను డిసేబుల్ చేసిన సదరు ఇంజనీర్ కు మూడో రోబోతో సమస్య తలెత్తింది. ఒక్కసారిగా ఇంజనీర్ పై దాడికి పాల్పడిన రోబో అతని వీపుతో పాటు భుజంపై గాయం చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది రోబోను డిసేబుల్ చేసి తీవ్రంగా గాయపడిన బాధితున్ని హాస్పిటల్ కు తరలించారు. అతని వీపుతో పాటు ఎడమ చేతికి బలమైన గాయమైనట్లు డాక్టర్లు చెప్పారు.
2021 ఇంజ్యూరీ రిపోర్ట్‌లో రోబో దాడి విషయం వెల్లడైంది. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు టెస్లా నిరాకరించింది. 2021 టెస్లా టెక్సాస్ ఫ్యాక్టరీలో ఈ ఘటన మినహా మరే ప్రమాదాలు జరగలేదని రిపోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఉద్యోగుల భద్రత గురించి టెస్లా పట్టించుకోదని, వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పనిచేయిస్తుందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నాయి.