అంజును నేను పెళ్లి చేసుకోను..పాకిస్థాన్ యువకుడి క్లారిటీ
X
భారత్‌కు చెందిన వివాహిత అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా క్లారిటీ ఇచ్చాడు.
పాకిస్థాన్ వచ్చిన అంజు తిరిగి ఆగస్టు 20న భారత్‌కు వెళ్లిపోతుందని తెలిపాడు. ఫేస్బుక్ ద్వారా స్నేహితుడిగా మారిన పాకిస్థానీ యువకుడు నస్రుల్లాను కలిసేందుకు 35 ఏళ్ల అంజు పాక్ వెళ్లింది. దీంతో వీరిద్దరి వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో నస్రుల్లా అంజుతో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు.
పాక్‌కు చెందిన నస్రుల్లా భారత్‌కు చెందిన అంజుకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. 2019 నుంచి వీరు ఆన్లైన్లోనే మాట్లాడుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అంజు నస్రుల్లాను కలిసేందుకు పాకిస్థాన్ వెళ్లింది. దీంతో వీరిద్దరి వ్యవహారం ఇరు దేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమ గురించి మీడియ తప్పుగా రాస్తోందని తనకు అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, మా మధ్య ప్రేమ వ్యవహారం లేనేలేదని వెల్లడించాడు నస్రుల్లా .
నస్రుల్లా మాట్లాడుతూ.."మేమిద్దరం మంచి స్నేహితులం. నన్ను కలిసేందుకే అంజు పాకిస్థాన్ వచ్చింది. మా మధ్య ఎలాంటి ప్రేమ లేదు. నేను ఆమెను పెళ్లి చేసుకోను. అంజు వీసా గడువు ముగిశాక ఆగస్టు 20న భారత్‌కు వెళ్లిపోతుంది. మా కుటుంబంలోని ఆడవారితో కలిసే అంజు ఓ ప్రత్యేక గదిలో ఉంటోంది. జిల్లా యంత్రాంగం మాకు తగిన భద్రత కల్పించింది "అని నస్రుల్లా తెలిపాడు.