Home > అంతర్జాతీయం > Yevgeny Prigozhin : బ్రతికే ఉన్నానంటున్న ప్రిగోజిన్.. ట్విస్ట్ అదిరిపోయిందిగా..

Yevgeny Prigozhin : బ్రతికే ఉన్నానంటున్న ప్రిగోజిన్.. ట్విస్ట్ అదిరిపోయిందిగా..

Yevgeny Prigozhin : బ్రతికే ఉన్నానంటున్న ప్రిగోజిన్.. ట్విస్ట్ అదిరిపోయిందిగా..
X

వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మాస్కో ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే.. ప్రిగోజిన్‌కు చెందిన ఓ వీడియో (Prigozhin Video) తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వాగ్నర్ గ్రూప్‌తో అనుసంధానమైన ఓ టెలిగ్రామ్ ఛానెల్ ఈ వీడియోని విడుదల చేసింది. ఇందులో తన యోక్షక్షేమాల గురించి చెప్పిన ప్రిగోజిన్.. తన సెక్యూరిటీ దళానికి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రిగోజిన్ చనిపోవడానికి ముందు ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో ప్రిగోజిన్ ఆర్మీ దుస్తుల్లో ఉండగా.. కదులుతున్న కారులో ఆగస్టు 21వ తేదీన ఈ వీడియోని రికార్డ్ చేశారు.





ఈ వీడియోలో ప్రిగోజిన్ మాట్లాడుతూ.. ‘‘నేను బ్రతికే ఉన్నానా? లేక చనిపోయానా? నేనేం చేస్తున్నాను? అని చర్చించుకునే వాళ్ల కోసమే ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఆగస్టు నెలలోని రెండో భాగంలోని వారాంతం. నేను ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాను. నా చావు గురించి, వ్యక్తిగత జీవితం గురించి, నేనెంత సంపాదిస్తున్నానన్న విషయాలపై జనాలు చర్చించుకుంటున్నారు. వాళ్లందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. అన్ని బాగున్నాయ్’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అయిన అంటోన్ గెరాష్చెంకో ఈ వీడియోని ట్విటర్‌లో (X ప్లాట్‌ఫామ్) షేర్ చేయడంతో.. ఇది చర్చలకు దారి తీసింది. ‘‘ప్రిగోజిన్ ఇంకా బ్రతికే ఉన్నాడా? లేదా?’’ అని నెటిజన్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ప్రిగోజిన్‌కి సంబంధించి మరిన్ని వీడియో షేర్ చేయాల్సిందిగా నెటిజన్లు కోరుతున్నారు.





ఇదిలా ఉండగా.. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ ఆగస్టు 23న సెయింట్ పీటర్స్‌బర్గ్‌ నుంచి మాస్కో వెళ్తుండగా విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. అయితే.. క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) కనుసన్నల్లోనే ప్రిగోజిన్‌ హత్యకు గురయ్యారంటూ పలు దేశాలు ఆరోపించాయి. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఖండించారు.




Updated : 1 Sept 2023 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top