టైటానిక్ దగ్గరకు 33 సార్లు వెళ్లిన జేమ్స్ కామెరూన్
X
టైటాన్ సబ్మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం వల్ల టైటాన్ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గతంలో తన అనుభూతిని పంచుకున్నారు.
జేమ్స్ కామెరూన్ పరిచయం అక్కర్లేని పేరు. టైటానిక్, అవతార్, అవతార్2 సహా ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు. 13వేల అడుగుల లోతున ఉన్న టైటానిక్ చరిత్రను డాక్యుమెంటరీ రూపంలోనూ తీసుకొచ్చారు. సాహసాలంటే ఇష్టపడే కామెరూన్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ప్రాంతాన్ని ఇప్పటివరకూ 33 సార్లు సందర్శించారు. ‘‘ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో టైటానిక్ మునిగిని ప్రాంతం ఒకటి. మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడడం నాకు ఎంతో ఇష్టం. అందుకే ఆ ప్రాంతానికి వెళ్లా’’ అని చెప్పారు.
ఇక టైటానికి తీయడం వెనుకున్న ఆసక్తికర కారణాన్ని కామెరూన్ చెప్పారు. ‘‘టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలన్న కోరికతోనే మూవీని తెరకెక్కించా. ఆ కారణంతోనే సబ్‌మెరైన్‌లో సముద్ర గర్భంలో ప్రయాణించా. అంతేకానీ ప్రత్యేకంగా దాన్నొక సినిమాగా తీయాలన్న ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతి పెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్ ఎవరెస్ట్‌లాంటిది. ఒక డైవర్‌గా దాన్ని మరింత బాగా చూపించాలనుకున్నా. అందుకే చాలాసార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించాను’’ అని వివరించారు.
అంతేకాదు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం కామెరూన్ కష్టమైన సాహసం చేశారు. ప్రపచంలోనే అత్యంత లోతైన సముద్ర ప్రాంతం పసిఫిక్ సముద్రంలోని మెరైనా ట్రెంచ్ అడుగు భాగానికి ఒక్కరే వెళ్లారు. ‘ఈ ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతానికి నేను వెళ్లాను. అప్పుడు ఈ గ్రహంపై నేనొక్కడే ఉన్నానా అనిపించింది. అక్కడ మనుషులెవరూ ఉండరు. ఏదైనా జరిగితే రక్షించేవారు అసలే ఉండరు’’ అని తన అనుభూతిని పంచుకున్నారు. కామెరూన్ సముద్రగర్భం ఇతివృత్తంగా ‘ఎక్స్‌పెడిషన్: బిస్‌మర్క్, ఘోస్ట్స్ ఆఫ్ ది అబేస్ అండ్ ఏలియన్స్ ఆఫ్ ది డీప్ డ్యాకుమెంటరీలను చిత్రాలను తీశారు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.