టైటానిక్ చూద్దామని వెళ్లి..సముద్రంలో గల్లంతైన కోటీశ్వరుడు
X
టైటానిక్ షిప్..ఈ పేరు వినపడగానే అత్యంత ఘోరమైన ప్రమాదం కళ్ల ముందు కదలాడుతుంది. విహార యాత్ర కోసం బయల్దేరిన ఈ భారీ నౌక ఎన్నో జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మంచు కొండను ఢీ కొట్టి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రగర్భంలో నిక్షిప్తమైంది టైటానిక్ షిప్. ఈ షిప్ ప్రమాదానికి గురై ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ వార్తల్లో ఏదో రకంగా నిలుస్తూనే ఉంటుంది. తాజాగా సముద్రం అడుగున ఉన్న ఈ టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల సబ్‌మెరైన్ మిస్ కావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సబ్‌మెరైన్‌లో పర్యటించే ప్రయాణికుల్లో బ్రిటన్‌కు చెందిన వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన హమీష్ హార్డింగ్ ఉండటం గమనార్హం. దీంతో ప్రయాణికుల ఆచూకి కోసం హుటాహుటిన గాలింపు చర్యలు మొదలుపెట్టారు అధికారులు.
ఈ జలాంతర్గామిలో ఐదుగురు పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ తెలిసిరాలేదు. ప్రమాద విషయాన్ని తెలుసుకుని అమెరికా సహా కెనడా రక్షణ బృందాలు అలర్ట్ అయ్యాయి. 22 అడుగుల పొడవున్న మినీ సబ్‌మెరైన్ జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. కొన్ని వందల చదరపు కిలోమీటర్లలో టీమ్‌లు సర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సాహస జర్నీని ప్రారంభించిన 1.45 గంటల్లోనే సబ్‌మెరైన్ కమ్యూనికేషన్‌ను కోల్పోయిందని అమెరికా కోస్ట్‌గార్డ్ బృందం తెలిపింది. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా హుటాహుటిన రంగంలోకి దింపారు. గాలింపు చర్యల్లో భాగంగా వాణిజ్య నౌకల సహాయాన్ని తీసుకుంటున్నారు. మునిగిన సబ్‌మెరైన్‌లో ఇంకా 72 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది. 10వేల కిలోల బరువున్న జలాంతర్గామి 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదని అధికారులు చెబుతున్నారు.
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రగర్భంలో మిస్ అయిన ఈ సబ్‌మెరైన్‌లో బ్రిటన్‌కు చెందిన 58 ఏళ్ల బిలియనీర్ హమీష్ హార్డింగ్ కూడా ఉన్నట్లు ఆయన సంస్థ యాక్షన్ ఏవియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. గతంలో హమీష్ సముద్ర గర్భాల్లో అత్యంత లోతైన పసిఫిక్‌లోని ‘ది ఛాలెంజర్ డీప్’ను సందర్శించారు. అదే విధంగా 2022లో బ్లూ ఆరిజిన్ స్పేస్ ఫ్లైట్‌లో కూడా ఈయన భాగస్వామ్యుడయ్యారు. హమీష్ హార్డింగ్‌కు సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు ఆస్తి ఉన్నట్లు సమాచారం.
సముద్ర గర్భంలో నిక్షిప్తమైవున్న టైటానిక్ షిప్ శిథిలాలను టూరిస్టులకు చూపించాలనే ఉద్దేశంతో ఓషన్ గేట్ అనే కంపెనీ సాహస యాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునేవారు రూ.2.50 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ టికెట్ ధర రూ.2 కోట్లు. ఈ యాత్రలో భాగంగా టూరిస్టులు 400 మైళ్ల దూరం వరకు ప్రయాణిస్తారు. అత్యాధునిక సెఫ్టీ ఫీచర్లతో ఈ మినీ జలాంతర్గామిని రూపొందించారు. అయినా ప్రమాదం జరగడంతో అందరూ ఏం జరుగుతుందోననే టెన్షన్లో మునిగిపోయారు.