ఎవర్నీ వదలను.. జడ్జిలు, లాయర్లకు ట్రంప్ వార్నింగ్
X
అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధ్యక్ష పదవి పోయిన తర్వాత కూడా వివాదాలతో వార్తలకెక్కుతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసే సమయంలో అధికార రహస్యాల పత్రాలను ఫ్లోరిడా లోని తన ఎస్టేట్‌కి తరలించినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే. అధ్యక్ష భవనంలో ఉండాల్సిన పత్రాలు బయట ఉంచడం నేరంగా పరిగణించి ఈ కేసు నమోదు చేశారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలని ప్రయత్నించారని, శాంతియుత అధికార మార్పిడికి అడ్డు తగిలారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ట్రంప్ పలువురికి వార్నింగ్ ఇచ్చారు. తనను వెంటాడి వేధిస్తున్న జడ్జీలు, లాయర్లు, సాక్షులు, కోర్టుపరంగా సంబంధమున్న ఎవరినీ వదలబోనని హెచ్చరించారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఓ వార్నింగ్ మెసేజ్ ను ఉంచారు. అంతటితో ఆగకుండా న్యాయశాఖ స్పెషల్ జడ్జీ జాక్ స్మిత్, మరో ఇద్దరు అటార్నీలపై బెదిరింపులతో కూడిన ప్రకటనను టీవీలో ప్రసారం చేయడానికి సన్నద్ధమయ్యారు. దీంతో ట్రంప్‌ను అడ్డుకోవడానికి న్యాయశాఖ రంగంలోకి దిగింది. సాక్ష్యాధారాలను ట్రంప్ న్యాయ బృందం బయట పెట్టకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని జిల్లా జడ్జి టాన్యా చట్కన్‌ను కోరింది.
అమెరికా పార్లమెంటు భవనంపై దాడి కేసులో నిందితులపై చట్కన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బరాక్ ఒబామా హయాంలో ఆమె నియమితులయ్యారు. ట్రంప్‌పై ఆరోపణల నిరూపణకు ప్రభుత్వం సమర్పిస్తున్న సాక్ష్యాధారాలను ఆయన లాయర్లు, సాక్షులు, వారి లాయర్లు, ... కోర్టు నియమించిన అధికారులకు తప్ప వేరెవరికీ చూపకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయాలని జడ్జి చట్కన్‌ను న్యాయశాఖ కోరింది. మరోవైపు ట్రంప్ శుక్రవారం అలబామా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తన మీద మరో కేసు నమోదైతే చాలు.. వచ్చే ఎన్నికలో గెలిచేది తానేనని ప్రకటించారు. తన మీద కేసు పెట్టిన ప్రతిసారీ ప్రజాభిప్రాయ సేకరణలో తనకే మద్దతు పెరిగిపోతోందని చెప్పారు. తనపై కేసులు దాఖలు చేసిన ప్రభుత్వ లాయర్లను బెదిరిస్తూ ట్రంప్ బృందం రూపొందించిన టీవీ యాడ్ సోమవారం వాషింగ్టన్, న్యూయార్క్, అట్లాంటా నగరాలతోపాటు నేషనల్ కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.