యూఎఫ్వోలు, గ్రహాంతర వాసులు ఉన్నారు...అమెరికా సాక్ష్యాలను దాచుతోంది
X
యూఎఫ్వోలు....ఏలియన్స్...ఎప్పుడో చాలా ఏళ్ళ నుంచీ వీటి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ కాన్సెప్ట్ తో బోలెడు సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఇవి ఇప్పటికీ ఉన్నాయా లేదా అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. వీటి మీద శాస్త్రవేత్తలు రీసెర్చ్ లు చేస్తూనే ఉన్నారు. తమ అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. చాలామంది మాత్రం గ్రహాంతరవాసులు ఉన్నారనే నమ్ముతుంటారు. ఇప్పుడు తాజాగా అమెరికా మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రష్ చేసిన కామెంట్స్ ఈ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చాయి.
భూమి మీద మనుషులు ఎలాగైతే ఉన్నారో....ఇతర గ్రహాల్లోనూ జీవులున్నారని అంటున్నారు డేవిడ్ గ్రష్. పైగా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు అమెరికా దగ్గర ఉన్నాయంటూ బాంబు కూడా పేల్చారు. అయితే వాటిని బయటకు రాకుండా అమెరికా దాచిపెడుతోందని చెప్పుకొచ్చారు. యూఎఫ్వోలతో పాటూ అందులో నుంచి సేకరించిన గ్రహాంతర వాసుల అవశేషాల మీద అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలు జరగుతున్నాయని డేవిడ్ చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమర్పించాయని చెప్పారు.
వాషింగ్టన్ లో ఓ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన డేవిడ్ క్రాష్డ్ క్రాఫ్ట్స్, దాని పైలట్లు నిజమేనని తెలిపారు. దీని గురించి తన దగ్గన ప్రత్యక్ష సమాచారం ఉందని...దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. 1930ల నుంచే అమెరికాకు వీటి గురించి తెలుసునని చెప్పారు. తాను ప్రత్యక్షంగా చూడలేదు కానీ హైలెవల్ ఇంటలిజెన్స్ అధికారుల దగ్గర నుంచి తనకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు డేవిడ్.
అయితే అమెరికా రక్షణ విభాగం మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. దేవిడ్ గ్రష్ చెప్పిందంతా అబద్ధం అంటూ తోసిపుచ్చింది. అలాంటి పరిశోధనలు ఏమీ జరగడం లేదని తేల్చి చెప్పేసింది.