ఫుల్లుగా మందుకొట్టి.. విమానాన్ని నడపబోయాడు.. లోపల 267మంది..
X
అది పారిస్ ఎయిర్ పోర్టు.. అక్కడ ఓ విమానం వాషింగ్టన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అందులో 267మంది ప్రయాణికులు ఉన్నారు. కాసేపట్లో విమానం గాల్లోకి ఎగురుతుందనగా.. ఊహించని ఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్ పోలీసులు వచ్చి పైలట్‌ను అరెస్ట్ చేశారు. దీంతో చేసేదేమిలేక విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం వాషింగ్టన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. పైలట్ విమానం ఎక్కే సమయంలో భద్రతాధికారులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆయన కళ్లు ఎర్రగా మారడంతోపాటు ఊగుతూ నడుస్తున్నట్లు వారు గుర్తించారు. దీంతో ఆయనకు బ్రీతింగ్ టెస్ట్ చేయగా.. ఫుల్లుగా మందు కొట్టినట్లు తేలింది. నిబంధనల కంటే ఆరు రెట్లు మద్యం తాగినట్లు గుర్తించారు. పైలట్‌ను అరెస్ట్ చేయడంతోపాటు విమానాన్ని రద్దు చేశారు.
ఆ తర్వాత పైలట్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. కేవలం రెండు గ్లాసుల మందు మాత్రమే తాగినట్లు పైలట్ కోర్టులో తెలిపారు. అయితే పైలట్ అదేస్థితిలో విమానం నడిపితే 267మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ కేసులో పైలట్‌కు 6నెలల జైలుశిక్షతో పాటు 5వేల డాలర్ల జరిమానా విధించారు. కాగా ఇటువంటి చర్యలను సహించేది లేదని యునైటెడ్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది. సదరు పైలట్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.