వీసాల జారీపై అమెరికా కీలక నిర్ణయం..!
X
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా టూరిజం దెబ్బతింది. పరిస్థితులు సద్దుమణగడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనాకు ముందుతో పోల్చితే స్పెయిన్, ఫ్రాన్స్లో పర్యాటక రంగం పుంజుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అక్కడ టూరిజం ఇప్పటికీ కోలుకోలేదు. దీంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
సగానికి తగ్గిన ఆదాయం
జూన్ చివరినాటికి అమెరికాలో పర్యాటకుల సంఖ్య కొవిడ్ మునుపటి పరిస్థితులతో పోల్చుకుంటే 26శాతం తక్కువగా ఉందని యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ ప్రకటించింది. టూరిస్టులు ఖర్చు చేసే సొమ్ము కూడా గణనీయంగా తగ్గిపోయిందని చెప్పింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పర్యాటక రంగం ద్వారా అమెరికాకు 99 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 2019లో 79.4 మిలియన్ల మంది టూరిస్ట్ వీసాపై వచ్చి 181 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే పర్యాటకం ద్వారా ఆదాయం దాదాపు సగానికిపైగా తగ్గింది.
వీసా ప్రాసెస్తో ఇబ్బందులు
యూఎస్‌లో పర్యాటకుల సంఖ్య తగ్గడానికి వీసా ప్రాసెస్ కూడా ఓ కారణమన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా టూరిస్ట్ వీసా కోసం కనీసం 400 రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా అగ్రరాజ్యానికి వెళ్లేందుకు ఎవరూ ఎక్కువగా ఆసక్తిచూపడం లేదు. కెనడా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దేశాలు టూరిస్టుల సంఖ్య పెంచుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా, ఇజ్రాయిల్ తదితర దేశాలైతే వీసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు ఛాన్స్ ఇచ్చాయి.
భారతీయులకు గుడ్ న్యూస్
తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా సైతం పర్యాటకుల్ని పెంచుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున ఇండియన్లకు టూరిస్ట్ వీసా వెయిటింగ్ టైంను తగ్గించి, వీలైనంత త్వరగా వీసా మంజూరు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.