వివేక్ రామస్వామి.. ఫస్ట్ డిబేట్‌లోనే అదరగొట్టాడు
X
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న నేతల మధ్య తొలి బహిరంగ చర్చ (Republican Debate) వాడీవేడీగా జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా మొత్తం 8 మంది అభ్యర్థులు ఆ పార్టీలో పోటీ పడుతుండగా.. బుధవారం జరిగిన ప్రాథమిక బహిరంగ చర్చలో ఆరుగురు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు భారత సంతతి నేతలు నిక్కీ హేలీ( Nikki Haley), వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఉన్నారు.ఈ చర్చ అనంతరం వివేక్ పేరు మారుమోగింది. అలాగే ఆయనకు అందే విరాళాల మొత్తంలోనూ పెరుగుదల నమోదైందని వార్తా కథనాలు వెల్లడించాయి.
తొలి బహిరంగ చర్చ తర్వాత వివేక్(Vivek Ramaswamy)కు పెరిగిన ప్రజాదరణ విరాళాల రూపంలో కనిపించింది. వివేక్ రామస్వామి ప్రచార బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్చ ముగిసిన గంటలోనే ఆయన 4.5 లక్షల డాలర్ల(3.7 కోట్ల రూపాయలు)ను విరాళాలుగా అందుకున్నారని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, మరో అభ్యర్థి ట్రంప్ గైర్హాజరీలో రిపబ్లిన్ చర్చలో వివేక్ కీలకంగా నిలిచారని ఓ కథనం వెల్లడించింది. చర్చ తరువాత జరిగిన సర్వేలో వివేక్ అభ్యర్థిత్వానికి ఏకంగా 28 శాతం మంది మద్దతిచ్చారు. 27 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు మద్దతుగా నిలవగా, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌కు 13 శాతం మంది, నిక్కీ హేలీకి 7 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అలాగే గూగుల్‌లో ఎక్కువగా వెతికిన నేతల్లో వివేక్ ముందువరుసలో ఉండగా, ఆయన తర్వాతి స్థానంలో హేలీ ఉన్నారు. ఆయన అందరి దృష్టిని ఆకర్షించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన సంపాదకీయంలో పేర్కొంది.
అలాగే చర్చ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివేక్ ఎంతో ధీమాగా కనిపించారు. అభ్యర్థిత్వ రేసులో ట్రంప్(Trump), తాను మాత్రమే మిగులుతామని జోస్యం చెప్పారు. అలాగే చర్చావేదికపై ట్రంప్‌ను కొనియాడారు. 21వ శతాబ్దంలో ఆయన బెస్ట్ ప్రెసిడెంట్ అని ప్రశంసించారు.