Home > అంతర్జాతీయం > తోక ముడిచిన ప్రిగోజిన్.. పుతిన్‌తో మాట్లాడి బెలారస్‌కు పరార్

తోక ముడిచిన ప్రిగోజిన్.. పుతిన్‌తో మాట్లాడి బెలారస్‌కు పరార్

తోక ముడిచిన ప్రిగోజిన్.. పుతిన్‌తో మాట్లాడి బెలారస్‌కు పరార్
X

ఉక్రెయిన్, రష్యాల యుద్ధం మధ్యలో పిడకల వేటలా మొదలైన అల్లరి 24 గంటలు తిరగకముందే చల్లారింది. రష్యా కిరాయి సైనిక బలగం చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ పొరుగు దేశమైన బెలారస్‌కు మకాం మార్చుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడి రాజీకి వచ్చారు. ప్రిగోజిన్ సారథ్యంలోని ‘వాగ్నర్’ కిరాయి మూకకు రష్యా ప్రభుత్వం తగినంత సాయం చేస్తుందని పుతిన్ హామీ ఇచ్చారు. దీంతో కొన్ని వాహనాలతో మాస్కోపై దాడి చేయడానికి బయల్దేరిన ప్రిగోజిన్ దారి మధ్యలో వెనక్కి మళ్లారు. చర్చలు సఫలం కావడంతో ఆయన తమ దేశానికి ప్రవాసానికి వస్తున్నారని మధ్యవర్తిత్వం నెరిపిన బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకో తెలిపారు. రష్యా ఆర్మీ కాంట్రాక్టుల్లో కొన్ని వాగ్నర్ గ్రూప్ ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.


ఉక్రెయిన్‌పై సాగుతున్న యుద్ధంలో వాగ్నర్ సాయుధులు రష్యాలకు మద్దుతుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే తమకు రష్యన్ సైన్యం నుంచి ఎలాంటి సాయమూ అండడం లేదని, కుక్కల్లా దిక్కులేని చావు చస్తున్నామని ప్రిగోజిన్ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికంతా పుతినే కారణమని, ఆయన గద్దె దించి కొత్త అధ్యక్షుణ్ని తీసుకొస్తామని బీరాలు పలికాడు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు యుద్ధం చేయడం చేతకావడం లేదని మండిపడ్డారు. అంతటితో ఊరుకోకుండా రెండు పట్టణాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించాడు. అయితే రష్యన్ ఆర్మీ వాగ్నర్ సైనికులకు బాంబు దాడులతో గట్టిగా చెక్ పెట్టింది. 40 వేల మంది మాత్రమే ఉన్న వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యాన్ని ఢీకొనడం అసాధ్యమని, వారిలో చాలామందికి సైనిక శిక్షణ లేకపోడంతో అల్లరి సద్దుమణుగుతుందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే తాట తీస్తానని పుతిన్ హెచ్చరించారు. వాగ్నర్ సైనికుల కాన్వాయ్‌పై శనివారం రష్యా వైమానిక దళం బాంబులు వేసింది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ దారికి వచ్చారు. రష్యన్ల రక్తం కళ్లజూడొద్దనే తాను వెనక్కి తగ్గానని చెప్పుకొచ్చాడు.


Updated : 25 Jun 2023 12:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top