అమెరికా శ్వేత సౌధంలో దొరికిన కొకైన్
X
అమెరికా వైట్ హౌస్ లో తెల్లటి పదార్ధం కలకలం సృష్టించింది. ప్రాథమిక పరీక్షల్లో అది కొకైన్ గా తేలింది. దీంతో వైట్ హౌస్ లోని వెస్ట్ వింగ్ ను అధికారులు సీజ్ చేసేసారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అనునిత్యం దీన్ని చెక్ చేస్తూనే ఉంటారు. అలా నిర్వహించిన తనీఖీల్లోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు కొకైన్ లభ్యమయింది. దీంతో వెంటనే శ్వేతసౌధంలోని వెస్ట్ వింగ్ ను ఖాళీ చేయించి వారిని మరో ప్రదేశానికి తరలించారు. కొకైన్ దొరికిన సమయంలో అధ్యక్షుడు బైడెన్ అక్కడ లేరు. ప్రస్తుతం ఆయన వీకెండ్ క్యాంప్ డేవిడ్ లో ఉన్నారు.
ప్రాథమిక పరీక్షల్లో తెల్లటి పదార్ధాన్ని కొకైన్ గా గుర్తించినా....దాని మీద మరిన్ని పరీక్షలు జరిపించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే దాన్ని ల్యాబ్ కు పంపించామని తెలిపారు. అసలు ఆ పౌడర్ వైట్ హౌస్ కు ఎలా చేరిందన్న దానిమీద సీక్రెట్ ఏజెంట్లు దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ వింగ్ అధ్యక్ష భవనానికి దగ్గరలో ఉంటుంది. క్యాబినెట్ రూమ్, ఒవల్ ఆఫీస్, ప్రెస్ రూమ్ లు అక్కడే ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనుల కోసం రోజూ చాలామంది అక్కడకు వచ్చి వెళుతుంటారు. వారిలో ఎవరో ఆ పౌడర్ తెచ్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ పనిని ఎవరు, ఎందుకు చేశారనేది తెలుసుకుంటామని అంటున్నారు.