పుతిన్ను వణికిస్తున్న ప్రిగోజిన్ ఎవరు.? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటీ.?
X
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు తన వంట మనిషే సవాల్ విసురుతున్నాడు. ఊహించని విపత్తు ఎదురవడంతో రష్యా దిక్కుతోచని స్థితిలో పడింది. ఒకప్పుడు తమతో కలిసి ఉన్న వాగ్నర్ సంస్థ ఇప్పుడు తిరుగుబాటు చేయడంతో రష్యా సైనిక బలగాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పుతిన్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ప్రిగోజిన్.. ఇప్పుడు ఏకంగా ఆయన్నే ఎదురించడం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ ప్రేక్షక పాత్రకు వహిస్తూ ఊపిరి పీల్చుకుంటోంది.
వాగ్నర్ గ్రూప్ అంటే ఏంటీ..?
వాగ్నర్ గ్రూప్ ఒక ప్రైవేట్, కిరాయి ఆర్మీ. దీన్ని రష్యా సైన్యంలో పనిచేసిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి ఉత్కిన్ ప్రారంభించారు. ఈ గ్రూపులో రష్యా రిటైర్డ్ సైనికులే ఉంటారు. కిరాయి సైన్యంగా ఉన్న వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే రష్యా ఆర్మీ, వాగ్నర్ గ్రూప్ మధ్య తీవ్ర విభేధాలు చోటు చేసుకున్నాయి. తమ గ్రూపులోని సభ్యులను రష్యా చంపేస్తోందని దాన్ని చీఫ్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు ప్రకటించినట్లు తెలుస్తోంది.
ప్రిగోజిన్ ఎవరు..?
రష్యా అధ్యక్షుడు పుతిన్ పొలిటికల్ సర్కిల్‌లోప్రిగోజిన్ అంటే తెలియని వారుండరు. అతన్ని పుతిన్ చెఫ్గా పిలుస్తారు. పుతిన్ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్ ఒకరు. 1990ల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తున్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ప్రిగోజిన్కు దక్కాయి.
2014లో రష్యా ఉక్రెయిన్ ద్వీపకల్పమైన క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో తొలిసారిగా వాగ్నర్ గ్రూప్, ప్రిగోజిన్ పేర్లు బయటకు వచ్చాయి. ఈ ఆక్రమణలో ప్రిగోజిన్ కీలకంగా వ్యవహరించడంతో అమెరికా అతనిపై 2016లో ఆంక్షలు విధించింది. అమెరికా ఎఫ్బీఐ అతనిపై 2,50,000 డాలర్ల రివార్డు కూడా ఉంది. మరోవైపు 2016లో ట్రంప్ కు అనుకూలంగా ఈ గ్రూపే ప్రచారం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వాగ్నర్ గ్రూప్ రష్యాలోనే కాకుండా లిబియా సివిల్ వార్, సిరియా, మాలి, సుడాన్, వెనుజులా వంటి దేశాల్లో రహస్యంగా పనిచేస్తోంది.
పుతిన్ ఆగ్రహం..
వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ తన వ్యక్తిగత లాభం కోసం రష్యాకు ద్రోహం చేస్తున్నాడని పుతిన్ ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో దేశ ప్రజలను రక్షించుకునేందుకు తాను ఏమైనా చేస్తానని హెచ్చరించారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో.. దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘సొంతలాభం కోసం వాగ్నర్ గ్రూప్ చీఫ్ రష్యాకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇది దేశ ద్రోహచర్య. దీనికోసం ఆయుధాలు చేతపట్టినవారిపై కఠిన చర్యలు తప్పవు. దేశ ప్రజలు రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటాను’’అని తీవ్రంగా స్పందించారు.