రూ. 830 కోట్ల ఖరీదైన కారులో తిరిగిన యూట్యూబర్...
X
మీరు చదివింది నిజమే! అతడు రూ. 830 కోట్ల ఖరీదైన కారులో తిరిగాడు!! అత్యధికమంది సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబర్లలో ఒకడైన అమెరికన్ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్ నాలుగు రోజుల కిందట 10 కోట్ల డాలర్ల విలువైన కారులో చక్కర్లు కొట్టాడు. ఫెరారీ 125 ఎస్ మోడల్లో తయారైన తొలి కారు ఇది. అంత విలువైన కారు కాబట్టే మ్యూజియంలో ఉంచారు. ఒక డాలర్ కారు మొదలు కోట్ల వందల కోట్ల విలువైన కార్లు నడిపే జిమ్మీ అరుదైన అనుభూతి పొందడానికి ఈ బండిలో రోడ్డుమీదికొచ్చాడు. మ్యూజియం ఉద్యోగి డ్రైవింగ్ చేస్తుండగా పక్కనే కూర్చుని తీసుకున్న వీడియోను ట్విటర్లో పోస్టడంతో వైరల్ అయ్యింది.
10 కోట్ల డాలర్ల కారేమిటని జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే కొన్ని పాతమోడల్ కార్ల విలువ అంతకంటే ఎక్కువ కావడం గమనార్హం. ఫెరారీ 125 ఎస్‌లో ప్రయాణంపై జిమ్మీ స్పందిస్తూ, తను అలాంటి కారులో వెళ్తున్నానంటే నమ్మలేకపోతున్నానని అన్నాడు. ‘మ్యూజియంలోని ఓ ఉద్యోగికి మాత్రమే దీన్ని నడిపే హక్కు ఉంది. కారును బయటికి తీసుకొచ్చినప్పుడు చుట్టుపక్కల పోలీసులను మోహరించారు. కారు దెబ్బతినకుండా గుంతలు పూడ్చేశాడు’’ అని జిమ్మి చెప్పారు. జిమ్మీ కార్లు నడిపే వీడియోలకు య్యూటూబ్ లో కోట్ల ఆదాయం వస్తుంటుంది. 2021లో 5.4 కోట్ల డాలర్ల సంపాదించాడు. నెలకు 50 లక్షల డాలర్ల (రూ. 41 కోట్లు) ఆదాయం వస్తుంటుందని అంచనా.