TCSలో లంచాలిస్తే ఉద్యోగాలు.. 100 కోట్ల అవినీతి..
X
లంచాలంటే చాలామందికి ఎమ్మార్వో ఆఫీసే గుర్తుకొస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు మన దేశంలో చాలా మామూలు. అయితే ఈ జాడ్యం ప్రైవేటు కంపెనీలకు కూడా అంటుకోవడం విస్తుగొలుపుతోంది. ప్రైవేటు కంపెనీల్లో ఆశ్రితపక్షపాతానికి, లంచాలకు చోటు ఉండదని అనుకోవడం భ్రమేనని తేలిపోతోంది. టాటాలకు చెందిన ప్రఖ్యాత ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో కళ్లు తిరిగే లంచాల బాగోతం వెలుగు చూసింది. ఉద్యోగాల నియమకాల కోసం పైస్థాయి అధికారులు భారీ స్థాయిలో లంచాలు దండుకున్నారు. టీసీఎస్‌లో ఇలాంటి అవినీతి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. కొన్నేళ్లుగా ఈ అవినీతి బాగోతం నడుస్తోంది.
కమిషన్ల రూపంలో రూ. 100 కోట్లను సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు జేబులో వేసుకున్నారు. టీసీఎస్ గత మూడేళ్లలో నేరుగానూ, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారానూ 3 లక్షల మందిని ఉద్యోగాల్లో నియమించుకుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కొందరు పైస్థాయి అధికారులు అభ్యర్థులను నుంచి లంచాలు వసూలు చేశారు. గ్రూప్ గ్లోబల్ హెడ్, ఈఎస్ చక్రవర్తి, స్టాఫింగ్ ఏజెన్సీల నుంచి వీరు డబ్బులు దండుకున్నారు. విషయం తెలిసిన కొందరు యాజమాన్యానికి ఉప్పందించారు. టీసీఎస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి రిక్రూట్‌మెట్ ఏజెన్సీల నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు పక్కా వివరాలు సీఈఓ, సీఓఓలకు అందాయి. దీంతో కంపెనీ అతనితోపాలు, ఆర్ఎంజీలోని మరో ముగ్గురు ఉన్నతాధికారులను శాశ్వతంగా ఇంటికి పంపింది. టీసీఎం ఆర్ఎంజీ రోజుకు 3వేల మందితోపాటు 1400 మంది ఇంజినీర్లకు ఉద్యోగాలు ఇస్తుంటుంది. సగటున ప్రతి నిమిషానికి ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకుంటూ ఉంటుంది.