108 అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహం.. రేపే ఆవిష్కరణ
X
పరమేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని 'ఐక్యతా విగ్రహం'గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 18న ఆవిష్కరించనుంది. ఇండోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వర్ లో నర్మదా నది ఒడ్డున ఉన్న మాంధాత పర్వతంపై 'స్టాట్యూ ఆఫ్ వన్‌నెస్' ఆవిష్కరిస్తారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహా నిర్మాణం కోసం 2,141 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను కేటాయించింది. రాష్ట్రం యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వాన్ని కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఓంకారేశ్వర్‌లో ‘అద్వైత లోక్’ పేరుతో మ్యూజియం, ఆచార్య శంకర్ ఇంటర్నేషనల్ అద్వైత వేదాంత ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు 36 హెక్టార్లలో ‘అద్వైత వనాన్ని’ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు.ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి సాధువులు హాజరుకానున్నారు.
శివ స్వరూపంగా భావించే ఆది శంకరాచార్యులు ఓంకారేశ్వర్‌లో నాలుగేళ్లపాటూ ఉన్నారు. కేరళలో జన్మించిన శంకరాచార్య తన బాల్యంలో సన్యాసం తీసుకున్న తర్వాత, ఓంకారేశ్వర్‌కు చేరుకున్నారు. అక్కడ తన గురువైన గోవింద్ భగవత్‌పాద్‌ను కలుసుకున్నారని చెబుతారు . మత విశ్వాసాల ప్రకారం, శంకరాచార్య అద్వైత వేదాంత తత్వాన్ని ప్రజలకు వ్యాప్తి చేయడానికి 12 సంవత్సరాల వయస్సులో ఓంకారేశ్వర్‌ను విడిచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారని చెబుతారు. ఈ క్రమంలోనే అనేక లోహాలతో చేసిన ఈ విగ్రహాన్ని 12 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న ఆది శంకరాచార్యులుగా ఆవిష్కరించనున్నారు.