Nanded Govt Hospital: 8 రోజుల్లో 108 మంది మరణం.. నాందేడ్ ఆస్పత్రిలో ఆగని మృత్యఘోష..
X
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. గత 8 రోజుల్లో ఈ ఆస్పత్రిలో 108 మంది మృతి చెందారు. గత 24 గంటల్లోనే 11మంది రోగులు మరణించడం విచారకరం. ఇటీవలకాలంలో ఈ ఆస్పత్రిలో భారీగా మరణాలు సంభవిస్తున్నారు. వారం రోజుల క్రితం కేవలం 48 గంటల్లోనే 31మంది చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఇప్పుడు మరోసారి మరణాల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది.
మందుల కొరత , వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆసుప్రతిలో రోగులు మృతి చెందారన్న ఆరోపణలను ఆస్పత్రి డీన్ శ్యామ్ వాకోడే ఖండించారు. వారంతా అత్యంత విషమ పరిస్థితుల్లోనే తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపింది. ‘‘మా ఆస్పత్రిలో మెడిసిన్ నిల్వలు సరిపడా ఉన్నాయి. మేం 3నెలలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుతాం. సిబ్బంది కూడా రోగులకు అన్నివేళలా చికిత్స అందిస్తున్నారు. ఔషధాల కొరత కారణంగా ఏ రోగీ ప్రాణాలు కోల్పోవట్లేదు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే చనిపోతున్నారు. ఇక మరణించిన చిన్నారుల్లో కొంతమందికి పుట్టుకతో వచ్చిన ఆరోగ్య సమస్యలున్నాయి’’ అని తెలిపారు.
కాగా ఆస్పత్రిలో వరుస మరణాల ఘటనను సుమోటోగా స్వీకరించిన బాంబే కోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అటు జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన పాలనలో వైద్యారోగ్యశాఖ గాడితప్పి పోయిందని విమర్శలు గుప్పిస్తున్నాయి.