Ayodhya Trust : అయోధ్య రామయ్యకు.. 12 లక్షల మంది నేసిన ప్రత్యేక వస్త్రాలు
X
అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ట్రస్ట్ సభ్యులు. ఈ నేపథ్యంలో రాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందించారు. అయితే ఈ వస్త్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. వీటిని ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన హెరిటేజ్ హ్యాండ్ వీవింగ్ రివైవల్ చారిటబుల్ ట్రస్ట్ ఓ కార్యక్రమం చేపట్టింది.
దానికి ‘దో ధాగే శ్రీరామ్‌కే లియే (శ్రీరాముడి కోసం రెండు పోగులు)’ అని పేరు పెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగానే పుణె జిల్లాలోని చేనేత కార్మికులంతా కలిసి ఈ వస్త్రాలు నేశారు. కాగా నిన్న ఈ పుణె చేనేత ట్రస్ట్ సభ్యులు.. యూపీ సీఎం యోగీ అధిత్యనాథ్ చేతుల మీదుగా.. ఈ వస్త్రాలను రామ జన్మభూమి ట్రస్ట్ కు అందించారు. ఈ సందర్భంగా పుణె చేనేత ట్రస్ట్ కు సీఎం యోగీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.