బుడ్డోడికి పెద్ద కష్టం.. రూ. 17 కోట్ల ఇంజెక్షన్తో నిలిచిన ప్రాణం..
X
ఆ చిన్నారి వయసు 15 నెలలు. బుడిబుడి నడకల వయసులోనే ఆ ముక్కుపచ్చలారని బుడ్డోడికి పెద్ద కష్టం వచ్చింది. పుట్టుకతోనే అరుదైన వ్యాధి ఆ బాలుడిని అనారోగ్యం పాలు చేసింది. ఆ చిన్నారి బతకాలంటే వేలు, లక్షలు కాదు.. కోట్లు కావాల్సిందే. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ బాలుడి తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. బిడ్డను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎట్టకేలకూ దాతల రూపంలో దేవుడు కరుణించాడు. చికిత్సకు అవసరమైన డబ్బు సర్దుబాటు కావడంతో ట్రీట్మెంట్ మొదలైంది.
ఉత్తర్ప్రదేశ్ సహారన్పూర్ కు చెందిన భూదేవ్ వయసు 15 నెలలు. కానీ పుట్టుకతోనే నాడీ వ్యవస్థలో చలనం లేకపోవడంతో తల నియంత్రణలో ఉండేది కాదు. కూర్చోవడం, నిలబడటం చేయలేకపోయేవాడు. బిడ్డను బాగు చేయించేందుకు తల్లిదండ్రులు ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. చివరకు ఆ చిన్నారి ఎస్ఎంఏ - టైప్ 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న డాక్టర్లు గుర్తించారు. ముక్కుపచ్చలారని చిన్నారి బతికాలంటే రూ.17కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ మాట వినగానే బాలుడి తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. కూలీ చేసుకుని బతికే ఆ కుటుంబం కొడుకును ఎలా బతికించుకోవాలో తెలియక సతమతమైంది. తమ బిడ్డను కాపాడమని కనిపించిన దేవున్ని కన్నీళ్లతో ప్రార్థించారు.
భూదేవ్ తల్లిదండ్రుల ప్రార్థనలు ఫలించాయి. ఆ బుడ్డోడికి సాయం చేసేందుకు ఫార్మా కంపెనీ నోవార్టిస్ ముందుకొచ్చింది. సేవ్ భూదేవ్ పేరుతో క్యాంపెయినింగ్ నడపడంతో ఎంతో మంది దాతలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం సైతం తన వంతుగా దిగుమతి సుంకం నుంచి మినహాయించింది. దీంతో రూ.17 కోట్లు పలికే ఆ ఇంజెక్షన్ ధర రూ. 10కోట్లకు తగ్గింది. దాతల ఆర్థిక సాయంతో విదేశాల నుంచి తెప్పించిన ఆ ఇంజెక్షన్ ఎయిమ్స్ డాక్టర్లు ఆ చిన్నారికి ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఐసోలేషన్ లో ఉన్నాడని, 2 నుంచి 3 వారాల్లో అతని నాడీ వ్యవస్థలో చలనం వస్తుందని చెప్పారు. కొన్ని నెలల్లో పూర్తి ఆరోగ్యవంతుడవుతాడని అన్నారు. అయితే చిన్నారి పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలని అంటున్నారు.
గతంలోనూ ఈ వ్యాధిబారిన పడిన చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెన్షన్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దాతల సహకారంతో ఇంజెక్షన్ ఇప్పించిన్నా కొన్ని నెలలకు ఆ పాప చనిపోయింది.