కోరమాండల్ ఎక్స్ప్రెస్లో 178 మంది ఏపీ ప్రయాణికులు
X
ఒడిశా బాలేశ్వర్ జిల్లాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైతులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 100కుపైగా ప్యాసింజర్లు విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. అయితే జనరల్ బోగిలో ఏపీకి చెందిన ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు కోరమాండల్ ప్రమాదం కారణంగా చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు బాలేశ్వర్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరింది. అటు రైలు మరమ్మత్తు కోసం సిబ్బందితో కూడిన ఓ ట్రైన్ విశాఖ నుంచి బాలేశ్వర్ నుంచి బయలుదేరింది. ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన యశ్వంత్ పూర్ ఎక్స్ప్రెస్లో ఎంతమంది ఏపీవాసులున్నారన్నది ఇంకా తెలియలేదు.
ఎయిర్ లిఫ్ట్ కు ఆదేశం
రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయనతో పాటు ముగ్గురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్లు అక్కడకు వెళ్లారు. అక్కడ పరిస్థితులు తెలుసుకన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్ మెంట్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు గాయపడినవారిని అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఏపీ నుంచి పలు వైద్య బృందాలు కాసేపట్లో బాలేశ్వర్ చేరుకోనున్నాయి.
కంట్రోల్ రూమ్స్
రైలులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలుసుకునేందుక జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఫోన్ల చేస్తున్న స్పందించని ప్రయాణికుల ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు. ఖరగ్‌పూర్, షాలిమార్ ప్రాంతాల నుంచి పలువురు తెలుగువారు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం పరిసర జిల్లాలో ఉన్న ఆసుపత్రి సిబ్బందిని, వైద్యులను, అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. దీంతో శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ తోపాటు 104, 108 వాహనాలు, డాక్టర్లు బాలాసోర్కు చేరుకున్నారు.
తెలుగువారి ఆచూకీ కోసం ప్రయత్నాలు
రైలు ప్రమాదంలో చనిపోయిన, గాయపడ్డ తెలుగువారి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలురు, కృష్ణా జిల్లాలకు చెందిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వరకు రిజర్వేషన్ చేసుకున్న 39 మందిలో 23 మంది ఫోన్ లో కాంటాక్ట్ లోకి రాగా.. మరో ఐదుగురు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని అధికారులు చెప్పారు. ఐదు మొబైల్స్ స్విచ్ఛాఫ్ రాగా.. రెండు నాట్ రీచబుల్ వస్తున్నాయని అన్నారు.